మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన తిరుగుబాటుకు నెల రోజుల కిందటే బీజాలు పడ్డాయా? అనే ప్రశ్నకు రాజకీయ వర్గాలు ఔననే సమాధానం చెబుతున్నాయి. ఈ తిరుగుబాటు ఆకస్మికంగా జరిగింది కాదని పేర్కొన్నాయి. కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలతో బెంగళూరులో శిబిరం నిర్వహించాల్సి వస్తుందని కర్ణాటకలోని భాజపా నేతలకు కొన్ని రోజుల కిందటే సమాచారం ఉంది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల బస ఏర్పాట్లను కర్ణాటక భాజపా ఎమ్మెల్యే ఒకరు చూస్తున్నారు. దాదాపు 15-20 రోజుల కిందటే ఆయనకు పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి సూచనలు వచ్చాయి. సదరు నేత ఫిబ్రవరి మూడో వారంలో దిల్లీ వెళ్లి, దీనిపై భాజపా పెద్దలతో సమాలోచనలు జరిపి వచ్చారు.
రిసార్ట్ రాజకీయాలు
నిజానికి మధ్యప్రదేశ్ నుంచి 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారం కిందటే బెంగళూరు వచ్చారు. వీరిలో ఇద్దరు ఆ తర్వాత తిరిగి వెళ్లిపోయారు. మిగతా ఆరుగురు ఇక్కడే ఉన్నారు. వీరి బసను కూడా ఆ భాజపా ఎమ్మెల్యే పలుమార్లు మార్చారు. వీరికితోడు మధ్యప్రదేశ్ నుంచి మరో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఒక అద్దె విమానంలో బెంగళూరు చేరుకున్నారు. తిరుగుబాటు నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాకు విధేయులైన ఈ 19 మంది ఎమ్మెల్యేలు నగరంలోని ఒక రిసార్టులో బస చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.
ఇంకా కొన్నాళ్లు బెంగళూరులోనే..
వీరు కనీసం రెండు వారాల పాటు ఇక్కడే బస చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్‌లో ప్రత్యామ్నాయ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టేవరకూ వీరి శిబిరం కొనసాగుతుందని వివరించాయి. ‘‘తొలుత కమల్‌నాథ్ సర్కారుపై అవిశ్వాస పరీక్ష, ఆ తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం విశ్వాస పరీక్ష ప్రవేశపెట్టాలి. అప్పటివరకూ బెంగళూరులో శిబిరం కొనసాగుతుంది’’ అని తెలిపాయి. మధ్యప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతున్నాయి.
ఇదీ చూడండి: అంబానీని వెనక్కి నెట్టి.. అగ్ర స్థానానికి జాక్మా!