కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేసే తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలువనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఉన్నతవిద్యాశాఖ మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్ వెల్లడించారు. జాతీయ విద్యావిధానంలోని హైలైట్స్, అమలుపై ఐదురోజుల పాటు నిర్వహించే ఆన్లైన్ వర్క్‌షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ మేరకు ప్రకటించారు మంత్రి. ఈ వర్క్‌షాప్‌ను బెంగళూరు విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది.
" జాతీయ విద్యావిధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన చట్టాల సవరణ, పరిపాలన సంస్కరణలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేస్తోంది. ఎన్ఈపీని అమలు చేసే తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలుస్తుంది."
- అశ్వత్ నారాయణ్, ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రి.
నిర్దిష్ట లక్ష్యాలు, స్పష్టమైన అజెండాతో ఎన్ఈపీ అమలుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి. ఎన్ఈపీ ముసాయిదా అందగానే ఉన్నతస్థాయి కార్యనిర్వాహక దళం ఏర్పాటు చేశామని, ఇప్పటికే కమిటీ సలహాలు, సూచనలు అందించిందని వెల్లడించారు. తుది మార్గదర్శకాలు రాగానే నూతన విద్యావిధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు అశ్వత్ నారాయణ్.
ఇదీ చూడండి: 21వ శతాబ్దం కోసం సరికొత్త జాతీయ విద్యా విధానం