విశ్వాస పరీక్ష ముగిసిన రెండు రోజుల తర్వాత కర్ణాటక అసంతృప్త ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేశ్ కుమార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 17 మంది రాజీనామాలు సమర్పించగా వారిలో ముగ్గురిపై అనర్హత వేటు వేశారు. 2023 వరకు పోటీకి అనర్హులని తెలిపారు.
స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్.శంకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జర్కిహోళి, మహేశ్ కుమటహళ్లిలను అనర్హులుగా ప్రకటించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో వెల్లడించారు.
అయితే స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్ శంకర్ రాజీనామా చేయకముందు.. తనను కాంగ్రెస్ సభ్యుడిగా గుర్తించాలంటూ గతంలో స్పీకర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆయనను కాంగ్రెస్ సభ్యుడిగా పరిగణిస్తూ స్పీకర్ వేటు వేశారు.
కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి చెందిన 15 మంది అసంతృప్త ఎమ్మెల్యేల భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో స్పీకర్ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. మిగిలిన ఎమ్మెల్యేలపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది.
- ఇదీ చూడండి: ముమ్మారు తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం