ఆకలితో అలమటిస్తున్న మూగ జీవాల కోసం వినూత్న ఆలోచన చేసింది కర్ణాటకకు చెందిన ఓ యువ బృందం. హుబ్లీ ప్రాంతంలోని వీధి కుక్కలకు ఆహారం అందించే చర్యల్లో భాగంగా.. అధునాతన సాంకేతికతతో ఓ యంత్రాన్ని ఆవిష్కరించారు 'రాయ్స్టీన్ ఫౌండేషన్' యువకులు. వాడి పడేసిన ప్లాస్టిక్ నీటి సీసాలను దాంట్లో వేస్తే చాలు.. శునకాలకు తిండి అందేలా రూపొందించారు.
ఈ మెషీన్ ద్వారా ప్లాస్టిక్ భూతాన్ని నివారించడం సహా.. ఆకలితో ఉన్న శునకాల కడుపు నింపే విధంగా రెండు ప్రయోజనాలను పొందవచ్చు. వాడేసి పడేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను అందులో వేస్తే.. యంత్రంలో సెట్ చేసిన విధంగా పెంపుడు జంతువులకు ఆహారం లభిస్తుంది. ఖాళీ సీసా వేసినా ఇదే ఫలితాన్ని పొందేలా దీన్ని అమర్చారు.
వారే స్ఫూర్తి..
కష్టాల్లో ఉన్నవారిని ఆదుకొని ఇటీవల వార్తల్లోకెక్కిన సినీనటుుడు సోనూసూద్, ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటాల స్ఫూర్తితో పనిచేస్తోందట ఈ యువకుల బృందం. అందులో భాగంగానే తొలుత.. ఈ మెషీన్‌ను ప్రారంభించినట్టు తెలిపింది. అంతేకాకుండా.. వీధి కుక్కల సంరక్షణ కోసం ప్రత్యేకంగా సీసీటీవీలు కూడా అమర్చినట్టు చెప్పొకొచ్చారీ యువ ఆవిష్కర్తలు.
అదే లక్ష్యం..
తొలుత.. 50 మెషీన్లను రూపొందించి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటుచేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారట. ఆ తర్వాత దాతల సాయంతో 15 రాష్ట్రాల్లో మొత్తం 750 యంత్రాలను అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు.
ఇదీ చదవండి: జవాన్‌కు గౌరవం- కాలు కింద పెట్టనీయకుండా గుడికి