కర్ణాటక ఆరోగ్య మంత్రి బీ.శ్రీరాములుకు డిప్యూటీ సీఎం కావాలని ఉందట! మంత్రి స్వయంగా వెల్లడించలేదు కానీ.. ఓ ఆలయంలో ఆయన దేవతను ఇలా కోరుకున్న విషయం బయటపడింది. ఇటీవల యాదగిరి జిల్లాకు వెళ్లారు మంత్రి శ్రీరాములు. పర్యటనలో భాగంగా గోనాల గ్రామంలోని గాదె దుర్గా దేవీ ఆలయాన్ని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఓ చీటీలో.. ''శ్రీరాములు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక, మస్ట్, కంపల్సరీ'' అని ఆంగ్లంలో రాసి దేవతను ప్రార్థించుకున్నారు. ఇప్పుడిదే బహిర్గతమైంది. ఈ అంశంపై స్పందించారు ఆరోగ్య మంత్రి.
''నేను కోరుకున్నది బయటకు చెప్పాలనుకోవట్లేదు. నేను దేవతను నా మనసులో ప్రార్థించాను. ఇప్పుడు నేను రాసిన లేఖ బహిర్గతమైంది. దేవీ దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని నా స్నేహితుడు చెప్పాడు.''
- బీ.శ్రీరాములు, కర్ణాటక ఆరోగ్య మంత్రి.
మంత్రివర్గ విస్తరణ వేళ...
కర్ణాటకలో కేబినెట్ విస్తరిస్తారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి యడియూరప్ప దిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలో మంత్రి కోరిక బయటపడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే ఈ అంశంపైనా స్పందించిన శ్రీరాములు.. ముఖ్యమంత్రి దిల్లీ వెళ్లింది కేబినెట్ విస్తరణ కోసం కాదని, వేరే పనుల కోసమని మీడియాకు వెల్లడించారు. కర్ణాటకలో ప్రస్తుతం ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు.
ఈడీ విచారణ సమయంలో.. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఈ ఆలయ దర్శనం చేసుకున్నారు. అనంతరం.. యాధృచ్ఛికంగా కేపీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.