కర్ణాటక అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాల అంశంపై నేడు స్పష్టత వస్తుందనుకున్న తరుణంలో తీర్పును బుధవారానికి వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం. అసమ్మతి ఎమ్మెల్యేలు, అసెంబ్లీ స్పీకర్, ముఖ్యమంత్రి తరఫున సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు... ఉదయం పదిన్నరకు నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది.
రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేల్లో మొదట 10 మంది, అనంతరం ఐదుగురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సభాపతి రమేశ్ కుమార్ కూడా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. వీరి వ్యాజ్యాలపై వాడీవేడి వాదనలు జరిగాయి.
ఎమ్మెల్యేల తరఫున ముకుల్ రోహత్గి, స్పీకర్ తరఫున అభిషేక్ మను సింఘ్వీ, సీఎం కుమారస్వామి తరఫున రాజీవ్ ధావన్ వాదనలు వినిపించారు.
ముందు రాజీనామాలు తేల్చండి...
అనర్హత వేటు వేయాలన్న ఉద్దేశంతోనే స్పీకర్ రాజీనామాలు ఆమోదించలేదని... అసమ్మతి ఎమ్మెల్యేల తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారం ముందు రాజీనామాల అంశంపై నిర్ణయం తీసుకున్నాకే అనర్హత గురించి ఆలోచించాలని కోర్టును కోరారు. బలపరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారని వాదించారు.
సుప్రీంకు ఆదేశాల్లేవు..
సభాపతి తరఫున సింఘ్వీ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే వరకు.. రాజీనామాలపై స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు సీజేఐ. బదులుగా... కోర్టు అనుమతి ఇస్తే రాజీనామాలు, అనర్హత ఫిర్యాదులపై స్పీకర్ రేపు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు సభాపతి తరఫు న్యాయవాది. జులై 12న సభాపతికి ఇచ్చిన నిలుపుదల ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోర్టును అభ్యర్థించారు.
రాజీనామాల కంటే ముందు అనర్హత ఫిర్యాదులకే ప్రాధాన్యం ఉంటుందని కోర్టుకు వివరించారు సింఘ్వీ. స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎవరూ కాలపరిమితి విధించరాదని తెలిపారు.
సీఎం తరఫున..
చివరగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తరఫున న్యాయవాది రాజీవ్ ధావన్ వాదనలు వినిపించారు. మంత్రి పదవి చేపట్టాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని వాదించారు ధావన్. స్పీకర్ నిర్ణయం తీసుకునే విషయంలో కోర్టు జోక్యం చేసుకోకూడదని పేర్కొన్నారు. సర్కార్ను అస్థిరపరిచేందుకే రెబల్ ఎమ్మెల్యేలు ముంబయి వెళ్లారని కోర్టుకు తెలిపారు.
ముగ్గురి తరఫున వాదనలు విన్న అనంతరం.. తీర్పును బుధవారానికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
గురువారం బలపరీక్ష...
కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్కు గురువారం అసలు పరీక్ష ఎదురుకానుంది. భాజపా ఒత్తిడితో.. స్పీకర్ ఆదేశాలతో... ముఖ్యమంత్రి కుమారస్వామి గురువారం విశ్వాసపరీక్ష ఎదుర్కోనున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలపై బుధవారం స్పష్టత రానున్న నేపథ్యంలో అధికార ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గుతుందా..? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇదీ చూడండి: కర్ణాటకీయం: బలపరీక్ష సవాలులో గెలుపెవరిది?