కర్ణాటక విధానసభలో సీఎం యడియూరప్ప నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం బలం నిరూపించుకుంది. ఊహించిన విధంగానే భాజపా తన సొంత సభ్యుల బలంతో సులభంగా బలపరీక్ష గెలుపొందింది.
అంతకుముందు ఏకవాక్య తీర్మానంతో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు యడియూరప్ప. విశ్వాస పరీక్ష సందర్భంగా సీఎం యడియూరప్ప, విపక్షనేత సిద్ధరామయ్య, జేడీఎస్ నేత కుమారస్వామి మాట్లాడారు. అనంతరం యడియూరప్ప మూజువాణి ఓటుతో గెలుపొందారు.
సొంతంగానే 105 మంది...
17 మందిపై అసంతృప్త ఎమ్మెల్యేలపై వేటుతో సభలో సభ్యుల సంఖ్య 207కు చేరింది. సభ విశ్వాసం పొందాలంటే 104 మంది సభ్యుల మద్దతు అవసరం. భాజపాకు ఎవరి మద్దతు లేకుండానే 105 మంది బలం ఉండటం వల్ల సులభంగా గెలిచింది.
'ప్రతీకార చర్యలకు పోము'
విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతీకార రాజకీయాలకు తాము పాల్పడబోమని యడియూరప్ప స్పష్టం చేశారు. కాంగ్రెస్- జేడీఎస్ కూటమి హయాంలో పరిపాలన నిలిచిపోయిందని ఆరోపించారు. తాము రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాకు యడియూరప్ప కృతజ్ఞతలు తెలిపారు.
ఖండించిన కూటమి నేతలు...
సంకీర్ణ కూటమిపై యడియూరప్ప చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఖండించారు. రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. కొత్తగా ఏర్పాటైన యడియూరప్ప సర్కారుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మంచి చేయాలని ఆకాంక్షించారు. రాజ్యాంగబద్ధంగా కాకుండా, అధర్మంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి తాము మద్దతుగా నిలవడం లేదని, అందువల్ల విశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
కుమారస్వామి విమర్శలు...
అధికార భాజపాపై కుమారస్వామి విమర్శలు చేశారు. రెబల్ ఎమ్మెల్యేలను రోడ్డుపాలు చేశారని ఆరోపించారు. తన పాలనలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసని, తాను యడియూరప్పకు జవాబుదారీ కాదని స్పష్టంచేశారు కుమారస్వామి.
- ఇదీ చూడండి: అసభ్య వ్యాఖ్యలపై లోక్సభలో ఆజంఖాన్ క్షమాపణ