కీలకమైన బల పరీక్షకు ముందు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి కాస్త ఊరట లభించింది. కాంగ్రెస్ సీనియర్ నేత రామలింగారెడ్డి తన రాజీనామాను ఉపసంహరించుకుంటానని ప్రకటించారు. అలాగే నేడు విధానసభకు హాజరవుతున్నట్లు తెలిపారు. విశ్వాస పరీక్షలో కుమారస్వామికే తాను మద్ధతిస్తానని స్పష్టం చేశారు. ఈ ఉదయం 11 గంటలకు అవిశ్వాస తీర్మానంపై కన్నడ అసెంబ్లీలో చర్చ జరగనుంది. అనంతరం కుమార స్వామి బల పరీక్షను ఎదుర్కోనున్నారు.
చర్చల అనంతరం
ఈ నెల 6న రాజీనామా చేసిన రామలింగారెడ్డితో సీఎం కుమారస్వామి, కొందరు కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు. అనంతరం బుధవారం రాత్రి తాను కుమారస్వామికే మద్దతిస్తానని ప్రకటించారు రామలింగారెడ్డి. గురువారం స్పీకర్‌తో సమావేశమై రాజీనామాను ఉపసంహరించుకుంటానని స్పష్టం చేశారు.
రామలింగారెడ్డి మద్దతుతో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం బలం 102 కు చేరనుంది. అయనతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా తనకు మద్దతిస్తారని కుమారస్వామి ఆశిస్తున్నారు. ఒకవేళ మిగతా 15 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు రాకపోతే సభలో సభ్యులు సంఖ్య 208కి చేరనుంది. ఈ తరుణంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్(105)కు మరో మూడడుగుల దూరంలోనే నిలిచిపోనుంది కుమార సర్కారు. అదే జరిగితే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో 107 మంది ఎమ్మెల్యేల బలాన్ని సాధించిన భాజపా ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేయనుంది.