అది 1999.. పాకిస్థాన్ కుటిల రాజనీతి.. భారత భూమిని ఆక్రమించాలన్న దుష్టపన్నాగం.. వెరసి.. కార్గిల్ యుద్ధం. ఈ పోరాటం సమతల భూమిమీదో, పీఠ భూముల్లోనో జరిగింది కాదు. వేల అడుగుల ఎత్తైన హిమశిఖరాలపై సాగిన కఠినమైన యుద్ధం. హిమగిరి శిఖరాలపై శత్రువుతో పాటు ప్రకృతితోనూ యుద్ధం చేయాల్సిన పరిస్థితులు. భారత భూభాగంలోకి అడుగుపెట్టేందుకు యత్నించిన ముష్కరమూకలు, వారికి సహాయంగా శతఘ్నులు పేల్చిన, తుపాకీ గుళ్ల వర్షం కురిపించిన పాకిస్థానీ సైన్య పటాలాలతో జరిగిన యుద్ధం. అంతకుముందు 1947-48 కశ్మీర్ ముట్టడి, 1965, 1971లో యుద్ధాల తర్వాత పాక్‌తో జరిగిన నాలుగో పోరాటం కార్గిల్. ఈ యుద్ధంలో భారత సైన్యం ప్రదర్శించిన సాహసం అసామాన్యం. ఒక్కో యోధుడి వీరగాధ ఓ బాలచంద్రుడిని, మహాభారతంలో అభిమన్యుడిని, సాహసవీరులు అల్లూరి, కుమ్రం భీంలను జ్ఞప్తికి తెస్తుంది.
కొదమ సింహాల్లా పోరాటం
ఎత్తైన పర్వతాలపై రహస్యంగా బంకర్లు నిర్మించుకుని భద్రమైన స్థావరాల నుంచి తూటాలు కురిపిస్తున్న ముష్కరమూకను తుదముట్టిస్తూ... భారత్ మాతాకీ జై అంటూ మన జవాన్లు చేసిన సింహనాదాలతో పాటు బోఫోర్స్ శతఘ్నల గర్జనలు ఇప్పటికీ ఆ నిశ్శబ్ద శిఖరాల్లో మార్మోగుతూనే ఉంటాయి. 1999 మే 3 న మొదలైన ఈ పోరాటం రెండు నెలల పాటు కొనసాగింది. ఇందుకోసం భారత్ 'ఆపరేషన్ విజయ్'లో భాగంగా 2 లక్షల మంది జవాన్లను కార్గిల్‌తో పాటు ఇతర కీలక ప్రాంతాలకు పంపింది. వైమానిక దళం 'ఆపరేషన్ సఫేద్ సాగర్'కు తోడు.. నౌకాదళం పాకిస్థానీ ఓడరేవులపై ప్రతిదాడికి సన్నద్ధమైంది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో జరిగిన యుద్ధంలో వీర సైనికుల సాహసమే విజయం వైపు నడిపించింది.
పోరాటానికి ప్రతీక
ఈ పోరాటం సైనికులు శక్తి సామర్థ్యాలకు, యుద్ధ పాటవాలకు పరీక్షగా నిలించిది.. ఆ తర్వాత ప్రతీకగా మారింది. జాతీయ రహదారి 1ఏ, 1డీ లాంటి కీలకమైన మార్గాలు రాకపోకలకు అతి క్లిష్టంగా మారినా పట్టువిడవలేదు. ప్రాణాలు కోల్పోతున్నా లెక్క చేయని భారత సైన్యం శత్రు మూకల్ని కీలకమైన స్థావరాల నుంచి నియంత్రణ రేఖ ఆవతలికి తరిమికొట్టింది. ద్రాస్ సెక్టార్‌లో అత్యంత ఎత్తైన పర్వతం పాయింట్ 5353ను సైన్యం కైవశం చేసుకుంది. కశ్మీర్‌లో జాతీయ రహదారి 1డీకి అతిసమీపంలో ఉన్న పర్వతం పాయింట్ 4590ని కైవసం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లోనే ఎక్కువ మంది భారత వీరులు నేలకొరిగారు. టైగర్ హిల్ పాయింట్ 5140 స్వాధీనం కోసం సైన్యం చేసిన సాహసం యుద్ధాల చరిత్రలో నిలిచిపోతుంది. పేర్లు లేని చాలా హిమ శిఖరాలపైనా తీవ్రపోరాటాలే జరిగాయి. భారత సైనికుల వీరోచిత పోరాటానికి ప్రతీకగా నిలిచాయి.
తిరిగి స్వాధీనం..
ఆపరేషన్ విజయ్‌లో.. ఎత్తైన హిమాలయ శిఖరాలపై రహస్యంగా బంకర్లు నిర్మించుకుని అక్కడి నుంచి మోర్టార్లు, గ్రెనేడ్‌లు, తుపాకులు, యుద్ధ విమానాలను కూల్చే ఆయుధాలతో దాడులు చేశారు. పాకిస్థానీ సైన్యం తుపాకీ గుళ్లు గురిపిస్తున్నా.. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా భారత సైన్యం గుండెలు ఎదురొడ్డి పోరాడింది. జూన్ 6 తేదీ నుంచి శత్రుమూకలపై తీవ్రస్థాయిలో ప్రతిదాడి చేసిన భారత్... ముష్కరుల ఆధీనంలోకి వెళ్లిన కీలక ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. హిమశిఖరాల్లో ఉన్న బటాలిక్ సెక్టార్లో కీలకమైన టోలోలింగ్, టైగర్ హిల్ ఇతర కీలకమైన ప్రాంతాలను కైవసం చేసుకుని ముష్కరమూకల్ని భారత సైన్యం తరిమేసింది.
అమరవీరుల విజయగాథ
ముష్కరుల చేతుల్లో చిత్రహింసలకు గురై వీరమరణం పొందిన ఐదుగురు జవాన్లతో మొదలైన కార్గిల్ యుద్ధ చరిత్రలో.... ఫ్లైట్ లెఫ్టినెంట్ నచికేత, స్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజ, మేజర్ పద్మపాణి ఆచార్య, లెఫ్టినెంట్ కర్నల్ విశ్వనాథ్, కెప్టెన్ అమోల్ కాలియా, మేజర్ రాజేశ్ , కెప్టెన్ అంజూనయ్యర్, సిపాయి రాథోడ్ ఇలా ఎందరో అమర జవాన్లు. మరెందరో పరమవీర చక్రలు పొందిన సైనికులు. ఒక్కొక్కరిదీ ఒక్కో వీరగాథ. ప్రస్తుతం కార్గిల్ కొండలు దీర్ఘకాలంగా మౌనంగా .. వీర జవాన్ల రక్త తర్పణంతో కూడిన దుఃఖంలో నిశ్శబ్ద స్థూపాలుగానే కనిపించొచ్చు. కానీ ప్రతీ ఏటా వచ్చే విజయ్ దివస్.. వారి గాథల్ని చరిత్ర ఉన్నంత కాలం చెబుతూనే ఉంటుంది.