కరోనా విజృంభిస్తున్న వేళ... ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ ప్రత్యేక సౌకర్యాలతో కూడిన బోగీలను తయారు చేసే పనిలో నిమగ్నమైంది. ఈ మేరకు కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీలో అధునాతన సౌకర్యాలతో కూడిన రెండు బోగీలను ప్రయోగాత్మకంగా నిర్మించింది. నాన్-ఏసీ బోగి కోసం 3 లక్షలు, ఏసీ బోగికి 6లక్షల రూపాయలు వెచ్చించినట్లు రైల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ రవీందర్ గుప్తా తెలిపారు.
బోగిల్లో ప్రయాణికులు కరోనా బారిన పడకుండా సౌకర్యాలు కల్పించినట్లు రవీందర్ చెప్పారు. కాలుతో ఆపరేట్ చేసే విధంగా నీటి కొళాయిలు, చెత్తడబ్బాలు, టాయిలెట్ ఫ్లష్‌లు, ముంజేయితో తెరిచేలా డోర్ హ్యాండిల్స్ వంటి సౌకర్యాలు ఉన్నట్లు వివరించారు.
బోగీల లోపలి భాగం ఎప్పటికప్పుడూ సూక్ష్మజీవిరహితం అయ్యేలా... ఏసీల్లో టైటానియం డయాక్సైడ్ పూసిన కోచ్‌లను వాడినట్లు తెలిపారు. తద్వారా ఏసీ నుంచి వచ్చే అయోనైజ్డ్ గాలి కోచ్‌ను ఎల్లప్పుడూ క్రిమిరహితం చేస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి వీటిని వాయువ్య మధ్య రైల్వేలో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు చెప్పిన రవీందర్ గుప్తా... త్వరలోనే అన్ని రైల్వే జోన్లలో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రామాలయ భూమి పూజకు అడ్వాణీకి ఆహ్వానం