"'టీవీలో ఈ వార్త చూసి ఆశ్చర్యానికి లోనయ్యా. ప్రజలను ఖర్చు లేకుండా పాకిస్థాన్‌కు పంపటంలో ఆయన నిమగ్నమయ్యారు. ఈ కారణంగానే బెగూసరాయ్‌లో ప్రచారానికి రావడం లేదు." -కన్నయ్యకుమార్, బెగూసరాయ్ సీపీఐ అభ్యర్థి.
పట్నాలో మార్చి 9న జరిగిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్‌షోకు హాజరు కాని వారిని దేశ ద్రోహులుగా ప్రకటించాలంటూ హాస్యోక్తులు విసిరారు కన్నయ్య. టీవీ ఛానెళ్లలోని భాజపా అనుకూల చర్చలు, వార్తలు వాస్తవం కాదన్నారు. రోడ్‌షోల్లో మోదీకి లభిస్తున్న ఆదరణే సిసలైన వాస్తవమన్నారు కన్నయ్య.
గిరిరాజ్ సింగ్ ప్రస్తుతం నవాడా ఎంపీగా కొనసాగుతున్నారు. భాజపా అధిష్ఠానం ఈసారి ఎన్నికల్లో ఆయనను నవాడా నుంచి కాక బెగూసరాయ్ నుంచి పోటీ చేయాలని సూచించింది.
గిరిరాజ్ అసంతృప్తి
బెగూసరాయ్ నుంచి పోటీ చేయాలని పార్టీ కోరిన విషయంపై ఓ ముఖాముఖిలో స్పందించారు గిరిరాజ్‌సింగ్. నవాడాలో పోటీ చేయడం తన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. 2014లో బెగూసరాయ్ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటే అధిష్ఠానం తనను నవాడా నుంచి పోటీ చేయించిందని గుర్తు చేశారు. పార్టీ కేంద్ర నాయకత్వంతో తనకెటువంటి విభేదాలు లేవని, రాష్ట్ర నేతలే నవాడా సీటు విషయంలో మోసం చేశారని వ్యాఖ్యానించారు.
వామపక్షాలకు పట్టుగొమ్మ బెగూసరాయ్
"మాస్కో ఆఫ్ బిహార్" అనే పేరు పొందిన బెగూసరాయ్... వామపక్షాలకు పట్టున్న స్థానం. 2014లో మొదటిసారిగా ఈ స్థానాన్ని భాజపా కైవసం చేసుకుంది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ బోలాసింగ్ గత 2018 అక్టోబర్‌లో మృతి చెందినప్పటి నుంచి ఖాళీగానే ఉంది.
దేశద్రోహం ఆరోపణలతో వెలుగులోకి..
దేశ విద్రోహ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నేత కన్నయ్య మొదటిసారి వెలుగులోకొచ్చారు. ఈ ఘటనపై అప్పట్లో ఆయనపై రాజద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో కన్నయ్య జైలుశిక్షనూ అనుభవించారు.
ఇద్దరూ ఒకే సామాజిక వర్గం
గిరిరాజ్ సింగ్, కన్నయ్యకుమార్ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. మహాకూటమి అభ్యర్థి పోటీలో నిలువలేకపోతే ఇరునేతల మధ్య హోరాహోరీ జరిగే అవకాశం ఉంది.