కరోనా బారిన పడి పలువురు ప్రముఖులకు విందు ఇచ్చిన బాలీవుడ్ గాయని కనికా కపూర్‌పై కేసు నమోదు చేశారు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు. ఈనెల 30న విచారణకు హాజరు కావాలని నోటీసు జారీచేశారు. కరోనా విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం సహా ప్రాణాంతక వైరస్‌ను వ్యాప్తి చేసే చర్యలకు పాల్పడినట్లు ఆమెపై అభియోగాలు మోపారు పోలీసులు. లఖ్‌నవూలోని సరోజినీ నగర్ పోలీస్ స్టేషన్‌కు ఈనెల 30న రావాలని స్పష్టం చేశారు. విచారణకు రాకపోతే కనికా కపూర్‌ను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరుస్తామని తేల్చిచెప్పారు.
బ్రిటన్ నుంచి వచ్చి స్వీయ నిర్బంధంలో ఉండకుండా రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సహా పలువురు ప్రముఖులకు విందు ఇచ్చినట్లు కనికాకపూర్‌పై ఆరోపణలు ఉన్నాయి. వీటిని తోసిపుచ్చిన కనికా.. తాను విందు ఇవ్వలేదని, స్నేహితులు ఇచ్చిన విందుకు హాజరయ్యానని తెలిపింది. ఆ సమయంలో వైరస్ బయటపడలేదని, పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని పేర్కొంది.
మార్చి 19న కరోనా పాజిటివ్‌గా తేలినట్లు నిర్ధరణ అయిన తర్వాత హాస్పిటల్‌కు వెళ్లింది కనిక. చికిత్స అనంతరం నెగిటివ్ వచ్చాక ఇంటికి చేరుకుని 21 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంది.