భాజపా సీనియర్ నేత, ఎమ్మెల్యే విశ్వేశ్వర్ హెగ్డే కగేరీ.. కర్ణాటక అసెంబ్లీ తదుపరి స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మంగళవారం మధ్యాహ్నం నిర్ణీత గడువు 12 గంటలలోగా ఆయన ఒక్కరే నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఫలితంగా.. ఈయన ఎన్నికపై అధికారికంగా రేపు సభలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సీఎం యడియూరప్ప సహా పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.
యడియూరప్ప సర్కారు విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం.. సభాపతి పదవికి రాజీనామా ప్రకటించారు రమేశ్ కుమార్. అనంతరం.. స్పీకర్ పోస్టుకు నామినేషన్లు కోరారు అసెంబ్లీ కార్యదర్శి. భాజపాకు మెజార్టీ ఉన్నందున.. తమ అభ్యర్థిని ప్రకటించలేదని స్పష్టం చేశాయి కాంగ్రెస్, జేడీఎస్‌లు.
''ఇప్పటివరకు విశ్వేశ్వర్ హెగ్డే కగేరీ నామినేషన్ ఒక్కటే దాఖలైంది.''
-విశాలాక్షి, అసెంబ్లీ కార్యదర్శి
94 నుంచి వరుస విజయాలు..
అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)లో కగేరీ క్రియాశీలకంగా పనిచేశారు. అంకోలా స్థానంలో 1994 నుంచి వరుసగా అసెంబ్లీకి ఎన్నికవుతున్నారు. గతంలో విద్యాశాఖ మంత్రిగానూ సేవలందించారు.
అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాల అనంతరం.. ఎన్నో నాటకీయ పరిణామాల నడుమ విశ్వాస పరీక్షలో ఓడి కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. ఫలితంగా.. 14 నెలల కుమారస్వామి పాలనకు తెరపడింది.
తదనంతరం యడియూరప్ప ప్రమాణ స్వీకారం, విశ్వాస పరీక్షలో గెలుపు, స్పీకర్ రాజీనామా చకచకా జరిగిపోయాయి.