కరోనా లాక్డౌన్ సాధారణ పౌరులకే కాదు.. న్యాయమూర్తులకూ కష్టాలు తెచ్చిపెట్టింది. వైరస్ కారణంగా విమానాలు, రైలు ప్రయాణాలు రద్దు అయిన నేపథ్యంలో గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా కొత్తగా నియమితులైన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ విశ్వనాథ్ సోమద్దర్ రెండువేల కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తోంది.
సోమవారం మధ్యాహ్నం వరకు ప్రయాణమే
కోల్‌కతా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ దీపాంకర్ దత్తా.. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఇప్పటికే కుటుంబాన్ని ముంబయికి పంపించారు జస్టిస్ దత్తా. బాధ్యతల నుంచి వైదొలిగిన అనంతరం కుమారుడితో కలిసి కారులో ముంబయికి బయలుదేరారు. ఇందుకోసం ఆయన రెండు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తర్వాతే ఆయన ముంబయికి చేరుకునే అవకాశం ఉంది.
శుక్రవారం నుంచి..
అలహాబాద్ హైకోర్టులో జడ్జిగా పనిచేసిన జస్టిస్ విశ్వనాథ్ సోమద్దర్.. మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టేందుకు మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు రోడ్డు మార్గం ద్వారా శుక్రవారం సాయంత్రం బయలుదేరారు. నేటి మధ్యాహ్నం ఆయన అక్కడికి చేరుకుంటారు.
జస్టిస్ దత్తా, జస్టిస్ సోమద్దర్ కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తులుగా 2006 జూన్ 22న ఒకేసారి ఎంపికయ్యారు. అయితే తాజాగా ప్రధాన న్యాయమూర్తులుగా ఒకేసారి పదోన్నతి పొందడం, బాధ్యతలు చేపట్టేందుకు రెండువేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడం ఆసక్తికరం.
ఇదీ చూడండి: దేశంలో వైరస్‌కు 'కొత్త రూపం'- వైద్యుల ఆందోళన