ఝార్ఖండ్ శాసనసభ తొలివిడత పోలింగ్ పలు ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 62.87శాతం పోలింగ్ నమోదైంది. తొలి విడతలో భాగంగా 13 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. 13 స్థానాలకు 189 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.
అవాంఛనీయ ఘటనలు
పోలింగ్ సందర్భంగా బిష్ణుపుర్ జిల్లాలోని ఓ కల్వర్టరు వద్ద మావోయిస్టులు బాంబు దాడి జరిపారని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని వెల్లడించారు. దల్తోగంజ్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో రెండు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్ధి కేఎన్ త్రిపాఠీ తుపాకీతో పోలింగ్ కేంద్రంలోకి వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆయనను అడ్డుకొని తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.
81 స్థానాలు గల ఝార్ఖండ్ శాసనసభకు మొత్తం అయిదు విడతల్లో పోలింగ్ జరగనుంది. చివరి విడత డిసెంబర్ 20న జరగనుండగా.. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 23న వెలువడనున్నాయి.
ఇదీ చూడండి: ఝార్ఖండ్లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం