రెండు నెలలుగా ఆంక్షలు, ఉద్రిక్తతలు, కర్ఫ్యూతో స్తంభించిన కశ్మీర్‌కు తిరిగి పర్యటక శోభ సంతరించుకోనుంది. ఉగ్ర ముప్పుతో కశ్మీర్‌ను విడిచివెళ్లిపోవాలని పర్యటకులకు జారీ చేసిన అత్యవసర ఆదేశాలను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 10 నుంచి కశ్మీర్లో పర్యటకులను అనుమతించనుంది. ఈ మేరకు జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం ఆగస్టు 5న రద్దు చేసింది. అందుకు కొన్ని రోజుల ముందే (ఆగస్టు 2) జమ్ముకశ్మీర్ పర్యటనపై ఆంక్షలు విధించింది.
కశ్మీర్‌లోని తాజా పరిస్థితులు- భద్రతా పరిణామాలను సమీక్షించేందుకు జరిగిన సమావేశంలో మాలిక్ ఈ మార్గనిర్దేశకాలను జారీ చేశారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలపైనా ఈ సమావేశంలో గవర్నర్‌తో చర్చించారు అధికారులు.
ఆగస్టు 5 నుంచి ప్రతి రోజు రెండు గంటలపాటు ఈ తరహా సమావేశాలు నిర్వహిస్తున్నారు గవర్నర్. విద్యాసంస్థల పునఃప్రారంభం, రవాణా వ్యవస్థ పునరుద్ధరణ తదితర కీలక నిర్ణయాలను ఈ సమావేశాల్లోనే తీసుకున్నారు.
ఇదీ చూడండి:- మెహబూబా ముఫ్తీతో పార్టీ నేతల భేటీకి అనుమతి