ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ కట్టడికి ఇళ్లలోనే ఉండాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు.. యావత్ భారతావని ఏకతాటిపైకి వచ్చింది. జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు ప్రజలు. వివిధ రాష్ట్రాల్లో ఉదయపు నడకకు కూడా వెళ్లకుండా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
నిర్మానుష్యంగా..
ప్రజలు ఇళ్లకే పరిమితమైన సందర్భంగా దేశమంతా వీధులన్నీ బోసిపోయాయి. రోడ్లపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అత్యవసర సేవలు మినహా అన్ని మూతపడ్డాయి. దుకాణాలు తెరుచుకోలేదు. వీధుల్లో జనసంచారం కనిపించలేదు. దేశవ్యాప్తంగా బంద్ తరహా దృశ్యాలు కనిపించాయి.
నగరాలన్నీ బంద్..
దిల్లీ సహా ముంబయి, పుణె, అహ్మదాబాద్, హైదరాబాద్, అమరావతి, బెంగళూరు, కోల్‌కతా, పట్నా, చండీగఢ్, చెన్నై, లఖ్‌నవూ, వారణాసి, కొచ్చి, తిరువనంతపురం వంటి ప్రముఖ నగరాలు జనసంచారం లేక వెలవెలబోయాయి.
జనతా కర్ఫ్యూలో భాగంగా హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్‌లో బస్సు సర్వీసులు నిలిపేశారు. ముంబయి, హైదరాబాద్‌లో మెట్రో రైళ్లను రద్దు చేశారు.
పూలతో అవగాహన..
దిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు పోలీసులు పువ్వులు ఇచ్చి జనతా కర్ఫ్యూ ఆవశ్యకతను వివరించారు. కరోనాపై పోరాడేందుకు మద్దతుగా నిలవాలని సూచించారు.
చప్పట్లతో సంఘీభావం..
కరోనా వైరస్ వ్యాప్తిని లెక్క చేయకుండా సేవలందిస్తోన్న వైద్యులు, వైద్య సిబ్బంది, పాత్రికేయులు, వివిధ రంగాల్లోని కార్మికులకు దేశ ప్రజలంతా సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో దేశంలోని రాజకీయ ప్రముఖులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు పాల్గొని మద్దతుగా నిలిచారు.
వివిధ రాష్ట్రాల్లో పొడగింపు..
జనతా కర్ఫ్యూను ఆదివారం (మార్చి22) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అయితే.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని 24 గంటలకు పొడిగించాయి. తెలంగాణ, హరియాణాలో సోమవారం ఉదయం 7 గంటల వరకు కొనసాగనుందని ప్రకటించాయి ఆయా ప్రభుత్వాలు. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా జనతా కర్ఫ్యూను పొడిగించాయి.
ఇదీ చూడండి: జనతా కర్ఫ్యూ అంటే? దాని అవసరం ఏంటి?
ఇదీ చూడండి: 'జనతా కర్ఫ్యూ ఆరంభం మాత్రమే.. పోరాటానికి సిద్ధమవ్వాలి'