జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై వారానికి రెండు రోజులు పౌర వాహనాల నిషేధం ఆదివారం అమల్లోకి వచ్చింది. ఈ నిషేధాజ్ఞలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన జమ్ముకశ్మీర్ పీసీసీ అధ్యక్షుడు గులాం అహ్మద్ మీర్... ఈ చర్యను అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు.
ఈ నిషేధం వల్ల ప్రజల వ్యాపారాలు దెబ్బతింటాయన్నారు. కాంగ్రెస్కు ఓటు వేసి వర్గ రాజకీయాలు చేసే వారిని అడ్డుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
హైవేపై సాధారణ వాహనాలు వారానికి రెండు రోజులు అంటే ప్రతి ఆది, బుధవారాల్లో నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. మే 31 వరకు ఈ నిషేధాజ్ఞలు ఉండనున్నాయి.
తక్కువ అసౌకర్యం..
జాతీయ రహదారిపై నిషేధాజ్ఞల వల్ల ప్రజలకు తక్కువ అసౌకర్యం కలిగే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. ట్రాఫిక్ ఆగిపోకుండా ఉండేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
"మొదటి రోజు నిషేధం విజయవంతంగా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నిషేధాజ్ఞలు మే 31 వరకు అమల్లో ఉంటాయి. ఒక వారంలోని 168 గంటల్లో 26 గంటల పౌరవాహనాల నిషేధం ఉంటుంది. ఇది 15 శాతంతో సమానం. మొత్తం నిషేధం ఉండనున్న 15 రోజుల్లో 8 ఆదివారాలే. ప్రజా రవాణా తగ్గితే నిషేధాజ్ఞలపై పునరాలోచిస్తాం "- ప్రభుత్వ ప్రకటన.
వైద్యం తదితర అత్యవసర పరిస్థితుల్లో వాహనాలను అనుమతించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వైద్యులు, వ్యాపారవేత్తలకు కూడా అనుమతివ్వనున్నట్లు తెలిపింది.