ఘటన వెనుక జైషే హస్తం: ఐజీపీ
జమ్ముకశ్మీర్‌లో పోలీసు బృందంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. శ్రీనగర్ శివార్లలోని నౌగామ్ వద్ద జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మరణించారు. మరొకరికి గాయాలయ్యాయి.
"శ్రీనగర్ నౌగామ్ బైపాస్ వద్ద ఉదయం 9.15 గంటలకు అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దాడిలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించాం. అందులో ఇద్దరు మరణించారు."
-సీనియర్ పోలీసు అధికారి
మరణించిన ఇద్దరు పోలీసులను ఇష్ఫాక్ అహ్మద్, ఫయాజ్ అహ్మద్‌లుగా గుర్తించారు.
ఈ ఘటన వెనుక జైషే మహ్మద్ ఉగ్రసంస్థ హస్తం ఉందని కశ్మీర్ ఐజీపీ పేర్కొన్నారు. దాడి చేసిన ముష్కరులను త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
నిఘా మరింత పెంపు
సంఘటన జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముష్కరుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో అధికారులు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. నగరంలో ప్రత్యేక చెక్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్వాతంత్ర్య వేడుకలు జరిగే ప్రతీ చోట పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉగ్ర కదలికలపై నిఘా ఉంచాలని స్పష్టం చేశారు.