దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ప్రస్తుతం ఆయన్ను ప్రాణాధార వ్యవస్థపై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
వైద్యుల బృందం ఇప్పటికే అరుణ్‌జైట్లీకి డయాలసిస్ చికిత్స ప్రారంభించింది. ఆదివారం సాయంత్రం ఆయనను ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ అక్సిజనేషన్ (ఈసీఎంవో) వ్యవస్థపై ఉంచింది. ఇది గుండె, శ్వాస వ్యవస్థలకు తోడ్పాటు అందిస్తుంది.
శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న అరుణ్‌జైట్లీని కుటుంబ సభ్యులు ఈ నెల 9న ఎయిమ్స్‌లో చేర్పించారు. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి 10వ తేదీ నుంచి ఎయిమ్స్... ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
ఆరోగ్య పరిస్థితిపై నేతల వాకబు..
రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహా కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, జితేందర్‌సింగ్, హర్షవర్థన్ తదితరులు ఆదివారం ఎయిమ్స్‌కు వచ్చి అరుణ్‌జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్ తదితరులూ జైట్లీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలిసుకున్నారు.
ఇంతకు ముందు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జైట్లీని పరామర్శించారు. భూటాన్ పర్యటన నుంచి తిరిగివచ్చిన ప్రధాని మోదీ... ఎయిమ్స్‌కు వెళ్లే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
బాధ్యతలు వద్దు
మోదీ 1.0 ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉన్న జైట్లీ క్యాన్సర్ బారినపడ్డారు. ఆ సమయంలో ఆయన అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్నారు. తిరిగి భారత్‌కు వచ్చి చికిత్సను కొనసాగిస్తున్న జైట్లీ.. మోదీ 2.0 ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకునేందుకు నిరాకరించారు.
ఇదీ చూడండి: ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్న భారీ వరదలు