జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోంది. షోపియాన్ జిల్లాలో 24 గంటల్లోనే 9 మంది ముష్కరులను మట్టుబెట్టాయి బలగాలు. పింజోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంలో సోమవారం ఉదయం నిర్బంధ తనిఖీలు నిర్వహించారు భద్రతా సిబ్బంది. వీరిని చూసి ఉగ్రవాదుల కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎన్కౌంటర్కు దారీతీసింది. తీవ్రంగా ప్రతిఘటించిన భద్రతా దళాలు.. నలుగురిని హతమార్చాయి.
ఆదివారం కూడా ఇదే తరహా ఘటన షోపియాన్ జిల్లాలోని రేబాన్లో జరిగింది ఆ ఘటనలో ఐదుగురు ముష్కరులను అంతమొందించారు భద్రతా సిబ్బంది. పింజోరాకు రేబాన్ 12కి.మీ దూరంలో ఉంది. ఈ ఘటనల్లో ముగ్గురు సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం ఉన్నప్పటికీ అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. మరణించిన 9 మంది ముష్కరులను హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థకు చెందిన వారిగా గుర్తించారు. వారిలో ఒక టాప్ కమాండర్ ఉన్నట్లు చెప్పారు.
రెండు వారాలుగా ఏరివేత..
ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా జమ్ముకశ్మీర్లో గత రెండు వారాల్లో 9 భారీ ఆపరేషన్లు నిర్వహించినట్లు చెప్పారు డీజీపీ దిల్బాగ్ సింగ్. ఈ ఘటనల్లో మొత్తం 22 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు వెల్లడించారు. వారిలో ఆరుగురు టాప్ కమాండర్లు ఉన్నట్లు చెప్పారు.