మహిళా అభ్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను ఈసీ మందలించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. నియంత్రణతో వ్యవహరించాలని హితవు పలికింది
"ఓ మహిళను 'ఐటం' అని పేర్కొన్న కమల్‌నాథ్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. నియమావళి అమలులో ఉన్నప్పుడు ఇలాంటి పదాలు, వ్యాఖ్యలు బహిరంగంగా ఉపయోగించకూడదని కమల్‌నాథ్‌కు ఎన్నికల కమిషన్ సలహా ఇస్తోంది."
-ఈసీ
గతవారం గ్వాలియర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా నేతను 'ఐటం' అని పేర్కొన్నారు కమల్‌నాథ్. దీనిపై ఈసీ నోటీసులు జారీ చేయగా... భాజపా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని వివరణ ఇచ్చారు.
భాజపా నేతకు నోటీసులు
మరోవైపు భాజపా నేత కైలాశ్ విజయ్వర్గియాకు ఈసీ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్ లక్ష్యంగా చేసిన 'చున్ను-మున్ను' వ్యాఖ్యలపై వివరణ కోరింది. 48 గంటల్లోగా స్పందించాలని సోమవారం నోటీసులో పేర్కొంది.
అక్టోబర్ 14న ఇండోర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో వర్గియా ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఈసీ తన నోటీసులో వివరించింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు ఇచ్చింది.