కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ అకస్మాత్తుగా విధించి పొరపాటు చేశారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అన్నారు. ఇప్పుడు లాక్డౌన్ను ఒకేసారి ఎత్తివేసే పరిస్థితి లేదన్నారు. అలా చేస్తే మహారాష్ట్ర ప్రజల కష్టాలు రెట్టింపు అవుతాయన్నారు. రానున్న వర్షకాలంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు.
మహారాష్ట్రకు రావాల్సిన జీఎస్టీ వాటా ఇంకా అందలేదని, సొంత రాష్ట్రాలకు వలస కార్మికుల తరలింపులో భాగంగా ప్రయాణికుల టికెట్ ధరలో కేంద్రం వాటా కూడా రావాల్సి ఉందని టీవీ సందేశంలో తెలిపారు ఠాక్రే. ఇప్పటికీ రాష్ట్రంలో ఔషధాల కొరత ఉందని, గతంలో పీపీఈ కిట్లు సహా ఇతర వైద్య పరికరాల కొరత సమస్యలను తాము ఎదుర్కొన్నామని వివరించారు.
కేంద్రం పెద్దగా సాయం అందించనప్పటికీ తాను మాత్రం బురద జల్లే రాజకీయాలు చేయబోనని ఠాక్రే స్పష్టం చేశారు.
కరోనా కట్టడి కోసం మార్చి 24 నుంచి దేశవ్యాప్త లాక్డౌన్ విధించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగో విడత లాక్డౌన్ మే 31తో ముగుస్తుంది.
సుదీర్ఘ కాలంగా ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న శివసేన గతేడాది తెగదెంపులు చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీతో జట్టుకట్టి మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.