చంద్రుడిపై ఇళ్లు నిర్మించాలని ప్రపంచ దేశాలు యోచిస్తున్నాయి. అయితే.. భూమిపై ఉపయోగించే నిర్మాణ పరికరాలు అంతరిక్షంలోకి తీసుకెళ్లడం సాధ్యమయ్యే పని కాదు. మరి చందమామపై వ్యోమగాములు ఇళ్లు ఎలా చేస్తారన్నదే పెద్ద సవాలు. కానీ ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపించి.. మరోసారి ప్రపంచ దేశాలకు తన సత్తాను చాటిచెప్పింది భారత్.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో), భారత వైజ్ఞానిక సంస్థ(ఐఐఎస్)కు చెందిన శాస్త్రవేత్తలు మహా అద్భుతాన్ని సృష్టించారు. చంద్రుడిపై ఇళ్ల నిర్మాణ కలకు జీవం పోస్తూ.. ప్రత్యేక అంతరిక్ష ఇటుకలను బెంగళూరులోని పరిశోధనా కేంద్రంలో రూపొందించారు.
జాబిల్లి వనరులతోనే..
జాబిల్లిపై ఉన్న వనరులతోనే నిర్మాణం జరగాలని ఏడేళ్ల క్రితమే భావించారు ఐఐఎస్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ అలోక్ కుమార్. తన బృందంతో కలిసి ఆయన ఆలోచనకు పదును పెట్టారు. చంద్రుడి ఉపరితలంపై లభించే మట్టిన కృత్రిమంగా సృష్టించి దానితో ఇటుకలు తయారు చేశారు.
ఈ పద్ధతిని వినియోగించి చంద్రుడిపై ఓ ల్యాబ్లో ఇటుకలు తయారు చేసి నిర్మాణాలు చేసుకోవచ్చు. ఇందుకోసం భూమి నుంచి అతి తక్కువ పరికరాలు తీసుకెళితే సరిపోతుందంటున్నారు అలోక్.
"కొన్ని రకాల బ్యాక్టీరియా, రసాయనాలను ఉపయోగించి చంద్రుడి మట్టితో ఇటుకలు తయారు చేశాం. విద్యుత్.. బ్యాక్టీరియా, నీళ్లు.. తీసుకెళ్తే చాలు. ఈ ఇటుకలను అతికించేందుకు సిమెంట్ అవసరమే లేదు. కేవలం బ్యాక్టీరియాల్లో సహజంగా ఏర్పడే పాలిమర్, గ్వార్ గమ్ ద్రవాలను వినియోగించుకుని వాటిని అతికించేయోచ్చు. కాకపోతే వాటికి సరిపడా ఆహారం తీసుకెళ్లాలి."
-అలోక్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
అలోక్ ఆలోచనతో.. చంద్రుడిపై వీధులు నిర్మించేందుకు భారత్ తొలి అడుగు వేసినట్లేనని అభిప్రాయపడుతున్నారు శాస్త్రవేత్తలు.