భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో), జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) సంయుక్తంగా చేపట్టబోయే మూన్ మిషన్ ప్రయోగం త్వరలో పట్టాలెక్కనుంది. నిజానికి... చంద్రయాన్-3లో ఇస్రో నిమగ్నమైన నేపథ్యంలో మూన్ మిషన్ ప్రయోగం ఆలస్యమైంది. ఈ క్రమంలో మూన్ మిషన్ కోసం అధ్యయన కమిటీ వేస్తున్నట్లు మంగళవారం ఇస్రో ప్రకటించడం వల్ల.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు స్పష్టమవుతోంది.
2023 తర్వాత ఇరు దేశాల ఉమ్మడి మిషన్ జపాన్ వేదికగా ఉండనుంది. ప్రయోగ వాహకంగా ఉపయోగించే హెచ్3 రాకెట్‌ను మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీ తయారు చేయనుంది. ఇది ల్యాండర్, రోవర్ రెండూ కలిగి ఉంటుంది.
"ఇండో-జపాన్ మిషన్ కోసం ఏం చేస్తామనేది.. చంద్రయాన్-3 ప్రయోగాన్ని బట్టి ఉంటుంది. వచ్చే ఏడాది చేసే ప్రయోగంలో మేము విజయం సాధిస్తామా? లేదా? అనేది మా పని తీరుకు లోబడి ఉంటుంది. ఈ నెలలో మొదట్లోనే అధ్యయన కమిటీ గురించిన సమాచారం మాకు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే ఇండో-జపాన్ మిషన్ మళ్లీ పట్టాలెక్కినట్లే."
- ఇస్రో శాస్త్రవేత్త
చంద్రుని ధ్రువ ప్రాంతాలలో నీటి ఉనికిని కనుక్కోవడం, దాని పరిమాణంపై పరిశోధన చేయడం మూన్ మిషన్ ఉద్దేశం.