నీటి కొరత, నాణ్యత నేడు ప్రజలను వేధిస్తున్న పెద్ద సమస్యలు. గంగ, గోదావరి, కృష్ణా, కావేరి, యమున, నర్మద తదితర జీవనదులు ఉప్పొంగే దేశంలో- జల సంక్షోభం తీవ్రరూపుదాల్చడం గమనార్హం. పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో భూగర్భ, ఉపరితల జల వనరులు కలుషితమైన నేపథ్యంలో తరుణోపాయం తెలియని సందిగ్ధావస్థ నెలకొంది. నల్లా నీటిపై భరోసా లేక శుద్ధజలం పేరిట అమ్మే నీటిని కొనుక్కుని తాగుతున్నా రోగాలు తప్పడం లేదు. ప్రజల అవసరాలు, బలహీనతలే పెట్టుబడిగా పుట్టుకొచ్చిన శుద్ధజల కేంద్రాలు ప్రమాణాలకు పాతరేసి తాగేయోగ్యత లేని నీటినే డబ్బాల్లో నింపి ప్రజారోగ్యంతో వ్యాపారం చేస్తున్నాయి. ఈ క్రమంలో అక్రమ శుద్ధ జల కేంద్రాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం శుద్ధిచేసే జలాల్లో 60 శాతం నీటిని వెనక్కు ఇచ్చే సామర్థ్యంలేని రివర్స్ ఆస్మోసిస్ (ఆర్‌ఓ) ప్లాంట్లను డిసెంబర్ 31 లోగా నిషేధించకపోతే జనవరి నుంచి సదరు అధికారుల జీతాల్లో కోత పెట్టాలంటూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు ఆదేశాలిచ్చింది. మొత్తం కరిగిన లవణాల సాంద్రత (టీడీఎస్) లీటర్‌కు 500 మిల్లీ గ్రాములకంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆర్‌ఓ నీటిని నిషేధించాలని ఉత్తర్వులిచ్చింది. దీనిపై స్టే విధించాలంటూ ఆర్‌ఓ ప్లాంట్ల తయారీదారుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కేంద్రంలోని సంబంధిత శాఖను సంప్రతించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అయితే, ఆర్‌ఓ నీటిని పూర్తిగా పక్కనపెట్టేయలేని పరిస్థితులూ ఉన్నాయి.
ఆర్‌ఓ నీటిని కలుషిత నీటికి ప్రత్యామ్నాయంగానే మాత్రమే కాకుండా, ఫ్లోరైడ్, లోహాల గాఢత, హానికర మూలకాల ముప్పు ఎక్కువగా ఉన్నచోట వాటి నుంచి బయటపడేందుకు ప్రజలు శుద్ధజలం వాడుతున్నారు. ఉదాహరణకు ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు పంటలకు వినియోగిస్తున్న రసాయన ఎరువులు, పురుగు మందులు, రొయ్యల సాగు వ్యర్థాలు, ఆక్వాకు వినియోగిస్తున్న ఉప్పు జలాల కారణంగా చాలా ప్రాంతాల్లో తాగు, సాగు నీరు కలుషితమైంది. ఆర్‌ఓ పరిజ్ఞానంతో శుద్ధి చేస్తేతప్ప ఈ నీటిని తాగడానికి వినియోగించలేని దుస్థితి నెలకొంది.
నల్లాలపై అపనమ్మకం
నీరు స్వచ్ఛంగా కనిపించినంత మాత్రాన నాణ్యత ఉన్నట్లు కాదు. కంటికి కనిపించని క్షారత్వం, ఆమ్లత్వం, భార లోహాల గాఢత్వం పరీక్షల ద్వారా మాత్రమే తెలుస్తుంది. అందువల్ల భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్) నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం శుద్ధిచేసిన నీటికి, సాధారణ యంత్రాలతో శుద్ధి చేసిన నీటికి మధ్య తేడా పెద్దగా తెలియదు. రుచి, నాణ్యతను మినహాయిస్తే చూడటానికి రెండూ ఒకేలా కనిపిస్తాయి. సరిగ్గా ఈ అంశమే ఆర్‌ఓ ప్లాంట్ల నిర్వాహకులకు కాసులు కురిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి అందిస్తున్న రక్షిత నీరు, అక్కరకు రాకుండా పోతుంటే ప్రైవేటు శక్తులు సరఫరా చేసే ఆర్‌ఓ నీరే దిక్కవుతోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అంతటా శుద్ధజలం పేరిట నాణ్యత లేని నీరే ముంచెత్తుతోంది. స్థానిక ప్రభుత్వాలు సరఫరా చేసే నల్లా నీటిని కాదని, శుద్ధజలం పేరిట ఇలాంటి డబ్బా నీటివైపు ప్రజలు మళ్లడానికి కారణాలు లేకపోలేదు. తెలుగు రాష్ట్రాల్లో భారీసంఖ్యలో తాగునీటి జలాశయాలు, రక్షిత మంచినీటి పథకాలు ఉన్నా నిర్వహణ అధ్వానంగా ఉంటోంది.
సకాలంలో జలాశయాలు, ట్యాంకులను శుభ్రం చేయకపోవడం, లీకేజీల కారణంగా కుళాయిల ద్వారా వచ్చే నీళ్లు కలుషితమవుతున్నాయి. స్థానిక సంస్థల సిబ్బంది క్లోరినేషన్ వరకు పరిమితమై, అదే నీటిని పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు 2009లో, అనంతరం 2014 తరవాత ఉభయ రాష్ట్రాల్లో పంపిణీ చేసిన నీటిపరీక్ష కిట్లను ఎక్కడా వాడిన దాఖలాలు లేవు. పలు నగరాలు, పట్టణాల్లో 30-40 ఏళ్ల క్రితం తవ్వి వేసిన గొట్టంమార్గాలు తుప్పుపట్టి, చిల్లులు పడి శిథిలమయ్యాయి. వాటిపక్కనే మురుగునీటి పారుదల వ్యవస్థా ఉండటంతో... రెండూ కలిసిపోయి తాగునీరు కలుషితమవుతోంది. నాణ్యత, నిర్వహణనుబట్టి రెండు మూడు దశాబ్దాలకోసారి భూగర్భ గొట్టంమార్గాల్ని మార్చాల్సి ఉన్నా, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా సర్కారు సరఫరా చేసే తాగునీటిపై నమ్మకం కుదరక, వాటిని తాగేందుకు జనం విముఖత చూపుతున్నారు. వ్యయ భారమైనా డబ్బా నీటినే కొని తాగుతున్నారు.
నియంత్రణ కొరవడి
జర్మనీ, రష్యా, అమెరికాల్లో ఆర్‌ఓ నీటిపై నిషేధం లేకున్నా అక్కడి ప్రభుత్వాలు ప్రోత్సహించడం లేదు. మనదేశంలో మాత్రం ఆర్‌ఓ ప్లాంట్లపై కనీస పర్యవేక్షణ కొరవడినందువల్ల నీటి వ్యాపారం వేలకోట్ల రూపాయలకు పడగలెత్తింది. తెలుగు రాష్ట్రాల్లో నీటిశుద్ధి కేంద్రాలపై నియంత్రణ లేకుండా పోయింది. వాటి సంఖ్య ఎంత అనే లెక్కలే లేవు. ఓ అంచనా ప్రకారం ఉభయ రాష్ట్రాల్లో 18 వేలకిపైగా ఆర్‌ఓ ప్లాంట్లు నడుస్తుండగా, వాటిలో 90 శాతం కేంద్రాలు అనుమతులు లేకుండానే వ్యాపారం సాగిస్తున్నాయి. హానికర సూక్ష్మజీవులతో కూడిన జలాన్ని ప్రజల గొంతుల్లోకి దింపుతున్నాయి. బీఐఎస్ నియమాలకు అనుగుణంగా ప్లాంటు పెట్టాలంటే- పాతిక నుంచి ముప్ఫై లక్షల రూపాయల ఖర్చవుతుంది. అప్పుడు 20 లీటర్ల డబ్బాకు రూ.30 దాకా ఖరీదు పెట్టాల్సి వస్తుంది.
ప్రజలు అంత ధర పెట్టరనే ఉద్దేశంతో నాలుగైదు లక్షల రూపాయల విలువైన ప్లాంటు పెట్టేసి, నామమాత్రంగా శుద్ధిచేసి ఖనిజాలు, నాణ్యత లేని నీటిని విక్రయిస్తున్నారు. అసలు నీళ్ల వ్యాపారం చేయాలంటే వివిధ శాఖల అనుమతులు తీసుకోవాలి. ముందుగా బీఐఎస్ వద్ద నమోదు చేయించుకోవాలి. ప్లాంట్లలో ప్రయోగశాలలు ఉండాలి. ఒక ఫార్మసిస్టు, ఒక మైక్రోబయాలజిస్టు సహా నలుగురు ఉద్యోగులను నియమించాలి. మూడు నెలలకోసారి గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో పరీక్ష చేయించాలి. నీటిలో లవణాలు, ఖనిజాలు ప్రమాణాల ప్రకారం ఉంటేనే డబ్బాల్లో నింపాలి. తేదీని ముద్రించాలి. నీటిలోని మలినాలు, లోహాల గాఢతనుబట్టి యంత్రాల్లో ఫిల్టర్లు, మెమ్రెయిన్లను తరచూ మార్చాలి. కనీసం ప్రతి 10 వేల లీటర్ల నీటి శుద్ధికి ఒకసారైనా కొత్త ఫిల్టర్లు వాడాలి. అయితే, వ్యాపారులు ఇలాంటి నిబంధనలేవీ పాటించకుండా, జీఎస్టీ సైతం చెల్లించకుండా యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నారు.
వాన నీరే పరిష్కారం?
ఏటికేడు భూగర్భ జలాలు తగ్గిపోతుండటం, పురుగు మందుల అవశేషాలు, భారలోహ మూలకాలతో భూమి లోపలి జలం కలుషితమవుతుండటం వల్ల బోరు నీటి వాడకం శ్రేయస్కరం కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అన్ని రకాల నీటి వనరులు కలుషితమైన పరిస్థితుల్లో వర్షం నీటిని ఒడిసిపట్టి శుద్ధి చేసుకొని తాగడంకంటే మించిన ప్రత్యామ్నాయం లేదు. భూగర్భ జల గాఢత తగ్గాలన్నా, ఉప్పునీటి సమస్యకు పరిష్కారం దక్కాలన్నా వాననీటిని భూమిలోకి ఇంకించాల్సిందే. అప్పుడే పాతాళ జలం స్వచ్ఛంగా మారుతుంది. ఇందుకు ప్రభుత్వాలు ఇళ్లల్లో ఇంకుడు గుంతలు, పొలాల్లో బోరు రీఛార్జి ఛాంబర్ల నిర్మాణాల్ని రాయితీల ద్వారా ప్రోత్సహించాలి. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వం సరఫరా చేసే నల్లా నీటిలో టీడీఎస్ 300 మి.గ్రా.లోపు, ఖనిజాలు సమతౌల్యంగా ఉంటే ఆ నీటినే కాచి వడపోసి తాగడం ఉత్తమం.
ఆర్‌ఓ నీటికి ఐఎస్‌ఐ గుర్తింపు ఉండాలని నిపుణుల సూచన. ఆర్‌ఓ ప్లాంట్ల ఏర్పాటు, నియంత్రణకు పటిష్ఠమైన నిబంధనలు రూపొందించాలి. బీఐఎస్ నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా స్థలం, యంత్రాలు, సిబ్బంది, శుద్ధి ఏర్పాట్లు ఉంటేనే నీటి ప్లాంట్లకు అనుమతులివ్వాలి. డబ్బానీటిపై పంచాయతీ, రెవిన్యూ, జలవనరుల శాఖలకు పర్యవేక్షణ బాధ్యత అప్పగించాలి. స్థానికంగా ప్రజలు తాగునీటికి వినియోగించే చెరువులు, చేతి పంపులు, బావులు, బోర్ల నీటిలో టీడీఎస్, పీహెచ్‌ను నెలకోసారి పరీక్షించాలి. రసాయనాల గాఢత, హానికర మూలకాల స్థాయుల వివరాల్ని ప్రజలకు తెలిపే ఏర్పాట్లుండాలి. ఫలితాలనుబట్టి సంబంధిత నీటిని వినియోగించ వచ్చో లేదో తెలపాలి. సీసం, పాదరసం, ఆర్సెనిక్, ఫ్లోరైడ్ మూలకాలు అధికంగా ఉంటే ఆ నీటి వాడకాన్ని నిషేధించాలి. స్థానిక సంస్థలు సరఫరా చేసే తాగునీటి నాణ్యత బీఐఎస్ ప్రమాణాల మేరకు ఉండే ప్రాంతాల్లో శుద్ధజలం పేరిట జరిగే వ్యాపారాన్ని నిషేధించాలి!
ప్రమాదభరితం
తాగే నీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్ తదితర సూక్ష్మ ధాతువులు నిర్దేశిత మోతాదులో ఉండాలి. ఇవి ఆహారంతోపాటు నీటి ద్వారా కూడా శరీరానికి అందుతాయి. ఏది ఎక్కువైనా రోగాల ముప్పు తప్పదు. తాగునీటిలో మొత్తం కరిగిన లవణాల సాంద్రత(టీడీఎస్) లీటరుకు 300 నుంచి 500 మి.గ్రా., ఉదజని పీహెచ్ ఏడు శాతం ఉండాలి. అయితే ఆర్‌ఓ పద్ధతిలో అతి సూక్ష్మయంత్రాలతో నీటిని శుద్ధి చేసినప్పుడు మలినాలు, సూక్ష్మజీవులతోపాటు ఉపయుక్తమైన ఖనిజాలూ పోతున్నాయి. టీడీఎస్ 100 లోపే ఉంటోంది.
జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎన్‌ఐఆర్‌డీ) నిర్వహించిన అధ్యయనం సైతం ఇదే విషయాన్ని తెలిపింది. దేశవ్యాప్తంగా కొన్ని నీటి శుద్ధి కేంద్రాల్లో సేకరించిన నమూనాల్లో కాల్షియం, మెగ్నీషియం స్థాయులు బాగా తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. శుద్ధిచేసిన నీటిని రోజుల తరబడి నిల్వ ఉంచుతున్నందువల్ల అవి కలుషితమవుతున్నాయి. అంతేకాకుండా అపరిశుభ్ర వాతావరణం, డబ్బాలు, నిల్వ ట్యాంకుల అపరిశుభ్రత కారణంగా అనేక ప్లాంట్లలో ప్రమాదకరమైన సూక్ష్మజీవులు బయటపడ్డాయి. ఆర్‌ఓ ప్రక్రియలో అనుసరించే కొన్ని పద్ధతుల వల్ల దీర్ఘకాలంలో వివిధ శరీర భాగాలపై ప్రభావం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడో హెచ్చరించింది.
- పావులూరి కిశోర్‌బాబు