రాహుల్ గాంధీ చేసిన 'రేప్ ఇన్ ఇండియా' వ్యాఖ్యలపై శుక్రవారం ఉదయం లోక్‌సభలో నిరసన గళం వినిపించిన భాజపా మహిళా ఎంపీల బృందం... సాయంత్రం ఎన్నికల సంఘం(ఈసీ) వద్దకు వెళ్లింది. కాంగ్రెస్ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మహిళా ఎంపీలు. అత్యాచార ఘటనలను రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు.
రాహుల్‌పై చర్యలు తీసుకోవాలి
శుక్రవారం జరిగిన పార్లమెంటు సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. 'మేక్ ఇన్ ఇండియా కాదు.. రేప్ ఇన్ ఇండియా' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అధికార భాజపా సభ్యులు ఆందోళనకు దిగారు. భాజపా మహిళా సభ్యులు లేచి రాహుల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు రాహుల్. యూపీఏ హయాంలో దిల్లీ 'రేప్ క్యాపిటల్'గా మారిందని గతంలో ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారన్నారు రాహుల్. ఆ వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.
పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న హింస నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే తన వ్యాఖ్యలపై భాజపా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు రాహుల్.
ఇదీ చూడండి: 'ప్లాస్టిక్‌పై వేటేద్దాం.. విస్తరాకుకే ఓటేద్దాం!'