కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కస్టడీని ఆగస్టు 3 వరకు పెంచుతూ దిల్లీ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఐఎన్ఎక్స్ కేసులో అవినీతి ఆరోపణలతో అరెస్టయిన చిదంబరం న్యాయనిర్బంధం నేటితో ముగిసిన నేపథ్యంలో ఆయనను దిల్లీ కోర్టులో హాజరుపరిచింది సీబీఐ. మరికొన్ని రోజులపాటు కస్టడీ పెంచాలంటూ సీబీఐ.. దిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్‌ను కోరింది.
అయితే.. సీబీఐ అభ్యర్థనను చిదంబరం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ వ్యతిరేకించారు. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదని, క్రమం తప్పకుండా చిదంబరానికి వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులు ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన కోర్టు.. చిదంబరాన్ని మరో 14 రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు
యూపీఏ హయాంలో 2004-14 మధ్యలో కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు చిదంబరం. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలతో ఆగస్టు 21న ఆయనను సీబీఐ అరెస్టు చేసింది.
అనంతరం.. 15 రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్నారు. తర్వాత విధించిన 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది.
చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపు రూ. 305 కోట్ల విదేశీ నిధులను అక్రమంగా పొందిందన్న ఆరోపణలతో 2017 మే 15న సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది. అనంతరం ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
ఇదీ చూడండి: సీన్ రివర్స్: నాడు అమిత్ షా.. నేడు చిదంబరం!