ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం జుడీషియల్ కస్టడీని అక్టోబర్ 17 వరకు పొడిగిస్తూ దిల్లీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. చిదంబరం కస్టడీ నేటితో ముగిసిన నేపథ్యంలో ఆయనను దిల్లీ కోర్టులో హాజరుపరచగా... న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
పొడిగింపులు కొనసాగుతున్నాయ్..
చిదంబరం జుడీషియల్ కస్టడీ పొడిగించాలని సీబీఐ అభ్యర్థించింది. ఈ విజ్ఞప్తిని చిదంబరం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ వ్యతిరేకించారు. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులు ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పించారు. ఇంటి నుంచి ఆహారం అందించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న కోర్టు.. చిదంబరం మరో 14 రోజులు జుడీషియల్ కస్టడీలోనే ఉంటారని స్పష్టంచేసింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు
యూపీఏ హయాంలో 2004-14 మధ్యలో కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు చిదంబరం. ఆ సమయంలో ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపు రూ. 305 కోట్ల విదేశీ నిధులను అక్రమంగా పొందిందన్న ఆరోపణలతో 2017 మే 15న సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది. అనంతరం ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. 2019 ఆగస్టు 21న ఆయనను సీబీఐ అరెస్టు చేసింది.
ఇదీ చూడండి: భారత్కు వచ్చేముందు హసీనాకు ఆయన నుంచి ఫోన్!