పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించే అంశమై భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి జావద్ జరీఫ్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న జావద్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి దౌత్యం పట్ల ఆసక్తి ఉంది.. కానీ అమెరికాతో చర్చలు జరపడంపై తమకు ఆసక్తి లేదని అన్నారు. సులేమానీని చంపడంలో అమెరికా దూకుడుగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. తాము యూఎస్‌తో అణు ఒప్పందం కలిగి ఉన్నామని.. కానీ అమెరికానే తన కట్టుబాట్లను కొనసాగించకుండా దాన్ని నాశనం చేసిందని తెలిపారు. ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల ఇరాన్ బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జరీఫ్.. "మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గించడంలో దిల్లీ కీలక పాత్ర పోషించగలదు. వీలైనంత త్వరగా పరిస్థితులు చల్లబడాలని భారత్ కోరుకుంటోంది. ఇరాన్, యూఏఈ, ఒమన్, ఖతర్ సహా పలు మధ్యప్రాచ్య దేశాలతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి." అని పేర్కొన్నారు.
ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అనంతరం జావద్ దిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుతం తమ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను డోభాల్‌కు వివరించారు. భద్రతా పరమైన అంశాలే వారిద్దరి మధ్య ముఖ్యంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
సులేమానీ హత్య...
ఇరాన్ మేజర్ జనరల్ సులేమానీని అమెరికా దళాలు జనవరి 3న డ్రోన్ సాయంతో హత్య చేశాయి. అనంతరం ఇరాన్ బాగ్దాద్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. ఈ క్రమంలో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
ఇదీ చూడండి: నిర్భయ దోషుల 'ఉరి'పై రాష్ట్రపతి నిర్ణయమే కీలకం!