కశ్మీర్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్రంలో భారీగా బలగాలను మోహరిస్తోన్న ప్రభుత్వం తాజా అమర్నాథ్ యాత్రను ఉన్నట్లుండి రద్దు చేసింది. ఈ నిర్ణయాల వెనుక నిఘా వర్గాల సమాచారమే కారణమని తెలుస్తోంది.
కశ్మీర్ లోయలో వరుస దాడులు చేసేందుకు జైషే మహ్మద్ ఉగ్రసంస్థ సిద్ధం చేసిన ప్రణాళికలు తుది దశకు చేరుకున్నట్లు నిఘా విభాగం హెచ్చరికలు చేసింది. తాజా నివేదికల ప్రకారం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నెజాపిర్ సెక్టార్‌లోని లాంచ్ప్యాడ్లలో మూడు జైషే బృందాలు సిద్ధంగా ఉన్నాయని సమాచారం.
పాక్ సైన్యం ఆధ్వర్యంలోనే..
పూంచ్ సెక్టార్ షాపుర్‌లోని భారత్ ఔట్‌పోస్ట్ ఎదురుగా ఉన్న ఈ స్థావరాల్లో ఉగ్రవాద బృందాలను పాకిస్థానీ ఎస్ఎస్జీ కమాండోలు మోహరించినట్లు తెలుస్తోంది. వీరితో బరూద్, షెర్, శక్తి, కైయాన్ ఫార్వార్డ్ పోస్టుల్లో ఉన్న భారత బలగాలపై దాడికి సిద్ధమైనట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.
భవిష్యత్తులో శ్రీనగర్-బారాముల్లా-ఉరీ జాతీయ రహదారిపై ఐఈడీ దాడులు చేయనున్నట్లు తెలిపాయి. ఈ మేరకు ఇప్పటికే కావాల్సిన పేలుడు సామగ్రి భారత్‌కు ఉగ్రసంస్థలు చేరవేశాయని వెల్లడించాయి నిఘా వర్గాలు.
రంగంలో పెద్ద తలలు
వ్యవహారంలో జైషే అధినేత మసూద్ అజార్ సోదరుడు ఇబ్రహీం అజార్ పాత్ర ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. పీఓకేలో ఇబ్రహీం కదలికలనూ నిర్ధరించుకున్నాయి. 15 మంది శిక్షణ పొందిన జైషే ఉగ్రవాదులు మార్కాజ్, సనమ్ బిన్ సల్మా, తార్నబ్ ఫామ్, పెషావర్, ఖైబర్ పంఖ్తుఖ్వా శిబిరాల్లో నక్కి ఉన్నట్లు సమాచారం సేకరించాయి. వీరంతా జైషేకు ప్రధానమైన అస్కారి కేంద్రంలో శిక్షణ పొందారు.
ఉగ్రదాడులకు జైషే పెద్ద తలలు రంగంలోకి దిగిన నేపథ్యంలో భారత సైన్యం మరింత అప్రమత్తమయిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారీ విధ్వంసానికే ప్రణాళికలు ఉంటాయన్న కోణంలో కశ్మీర్ లోయలో భద్రతపై కేంద్రం దృష్టి పెట్టింది.
ప్రాంతీయ నేతల అభ్యంతరాలకు అదే సమాధానం
కశ్మీర్లో బలగాల మోహరింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను ప్రాంతీయ పార్టీల నేతలు మహబూబా ముఫ్తీ, ఓమర్ అబ్దుల్లా కలిశారు. ప్రజల్లో వర్గ పోరు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా ఉగ్రదాడులు, ఎదురుకాల్పుల్లో చనిపోయిన ముష్కరుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలకు సంబంధించిన విషయాలను ప్రాంతీయ నేతలకు వివరించారు మాలిక్. వీరితో నిఘా సమాచారాన్ని పంచుకున్న మాలిక్.. సహకరించాలని కోరారు. తప్పుడు వార్తలను నమ్మవద్దని సూచించినట్లు సమాచారం. పరిస్థితి సద్దుమణిగే వరకు పార్టీలు, వారి మద్దతుదారులు ప్రశాంతంగా ఉండేలా చూడాలని కోరినట్లు తెలుస్తోంది.
వరుస పరిణామాలు
అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా పాక్ సైన్యం, ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని సైనిక ఉన్నతాధికారులు శుక్రవారం హెచ్చరించారు. కొద్ది సేపటికే యాత్రను రద్దు చేస్తు కశ్మీర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కశ్మీర్లో మొదట 10 వేల భద్రతా సిబ్బందిని తరలించిన కేంద్రం.. ఇటీవలే మరో 28 వేల బలగాలను మోహరించింది.
ఇదీ చూడండి: 'కశ్మీర్ వదిలి అమర్నాథ్ యాత్రికులు వెళ్లిపోవాలి'