భారత నౌకాదళంలో విశేష సేవలందించిన ఐఎన్ఎస్ విరాట్.. ఈ-వేలానికి మరోమారు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. వచ్చే మార్చిలో వేలం ప్రక్రియను చేపట్టనున్నట్లు వెల్లడించింది. అయితే.. గత ఏడాది డిసెంబర్లో ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నౌకను వేలం వేసేందుకు చేపట్టిన చర్యలు ఫలించకపోవటం వల్ల మరోసారి నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఐఎన్ఎస్ విరాట్ వేలంపై లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానం అందించారు రక్షణ శాక సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్.
"2019, డిసెంబర్ 17న ఈ-వేలం చేపట్టాం. అందులో ముగ్గురు బిడ్డర్లు పాల్గొన్నారు. అయితే.. ప్రభుత్వ ధరకన్నా 50 శాతం తక్కువ ధర కోట్ చేసిన కారణంగా ఎంఎస్టీసీ బిడ్డింగ్ ప్రక్రియలో చేపట్టిన వేలం తిరస్కరణకు గురైంది."
- శ్రీపాద్ నాయక్, రక్షణ శాఖ సహాయ మంత్రి
గతేడాది డిసెంబర్లో చేపట్టిన వేలం ప్రక్రియను ఎంఎస్టీసీ సంస్థ నిర్వహించింది. ఓడలను తుక్కు కింద మార్చే విధానంలోని ప్రభుత్వ నియమాల ప్రకారం ధరను నిర్ణయించినట్లు తెలిపారు మంత్రి.
ఇదీ చూడండి: నూతన భద్రతా సవాళ్ల కోసం.. నవీన సాంకేతిక పరిజ్ఞానం: మోదీ