ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సీఈపీ)లో భారత్ చేరకపోవటంపై దేశీయ పారిశ్రామిక, వ్యాపార వర్గాలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చారిత్రాత్మకమని అభిప్రాయపడ్డారు.
థాయిలాండ్‌లోని బ్యాంకాక్ వేదికగా జరిగిన ఆర్సీఈపీ సమావేశంలో భారత్ వైఖరిని కరాఖండిగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వాణిజ్య రంగంలో అంతర్జాతీయ పోటీకి భారత్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. స్వేచ్ఛావాణిజ్య ఒప్పందంలో ప్రధాన ప్రయోజనాలపై స్పష్టత లేదని మోదీ అభిప్రాయపడ్డారు.
సీఐఐ హర్షం..
ఆర్సీఈపీలో చేరే ముందు సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించి.. తన వైఖరిని వెల్లడించిన భారత ప్రభుత్వ తీరుపై భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాల ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో కలిసే ప్రయత్నంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు సీఐఐ అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్.
ఫిక్కీ..
ఆర్సీఈపీలో చేరకూడదని ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా నిలిచింది ఫిక్కీ. ఆర్‌సెప్‌లో భారత్ లేవనెత్తిన ఆందోళనలు, సమస్యలు ఇప్పటివరకు పరిష్కరించలేదని, చర్చ జరగలేదని ఫిక్కీ అధ్యక్షుడు సందీప్ సోమనీ పేర్కొన్నారు. దేశంలోని ఉక్కు, ప్లాస్టిక్, రాగి, అల్యూమినియం, యంత్ర పరికరాలు, కాగితం, ఆటోమొబైల్స్, రసాయనాలు, పెట్రో-కెమికల్స్ వంటి వివిధ రంగాలు ఆర్సీఈపీపై తీవ్రమైన భయాందోళనలు వ్యక్తం చేశాయన్నారు. ప్రభుత్వ నిర్ణయం పారిశ్రామిక వర్గాలకు లబ్ధి చేకూర్చుతుందని తెలిపారు.
మైలురాయి..
భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఓ మైలురాయి అని అభిప్రాయపడ్డారు పాల సరఫరాదారు అమూల్ సంస్థ ఎండీ ఆర్ఎస్ సోధి. ప్రభుత్వ నిర్ణయం వల్ల 10 కోట్ల మంది దేశీయ పాడి రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఆర్సీఈపీలో చేరి ఉంటే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల నుంచి చౌక ఉత్పత్తులు భారత్‌లోకి దిగుమతి అయ్యి పాడి రైతులపై తీవ్ర ప్రభావం చూపేదన్నారు. పాడి పరిశ్రమ ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని కొనియాడారు సోధి.
దేశంలోని కోట్లాది మంది రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారుల జీవితం, జీవనోపాధిని మార్చే నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంది అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ).
ఇదీ చూడండి: దేశ ప్రయోజనాలకే పెద్దపీట.. ఆర్సెప్కు భారత్ నో