దేశంలో లాక్డౌన్ వేళ పేదల పరిస్థితి దయనీయంగా మారింది. పేదలు, వలస కార్మికులు, రోజువారీ కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆకలితో అల్లాడుతున్నారు. కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో.. వారికి అండగా నిలుస్తోంది ఇందిరా క్యాంటీన్. ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు ప్రతిరోజు కడుపు నిండా తిండి పెడుతోంది. ఉచిత భోజనం అందిస్తూ వారి ఆకలిని తీరుస్తుంది.
ఇందిరా క్యాంటీన్‌కు ప్రజలు తరలివెళ్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో.. ఆహారం కోసం క్యూలో నిలబడే వారు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటోంది.
పేదలకు అతి తక్కువ ధరకే భోజనం అందించాలని.. 2017 ఆగస్టు 16వ తేదీన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇందిరా క్యాంటీన్‌ను ప్రారంభించారు. అప్పటినుంచి అల్పాహారం రూ.5, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని రూ.10కే అందజేస్తోంది.
అక్కడ అమ్మ క్యాంటీన్..
కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్ తరహాలోనే.. తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లు ఎందరో పేదలకు అక్షయ పాత్రగా మారాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తున్న ఈ క్యాంటీన్ల ద్వారా అతి తక్కువ ధరకే అల్పాహారం, భోజనం అందిస్తున్నారు. రూపాయికే ఇడ్లీ, రూ. 3కు పెరుగన్నం, ఇతర భోజనం 5 రూపాయలకే అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోందీ పళనిస్వామి సర్కార్. హోటళ్లు, మెస్‌లను నమ్ముకున్న ఉద్యోగస్తులు, పేదలు ఇంకా ఎందరో ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో అమ్మ క్యాంటీన్లపైనే ఆధారపడుతున్నారు.
ఇదీ చూడండి : 'కరోనా వైరస్ కన్నా భయమే అతి పెద్ద సమస్య'