దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత మూడు రోజులుగా మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 10 శాతం లోపే ఉంటోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 10 కేసుల్లో ఒకటి మాత్రమే యాక్టివ్ కేసు ఉందని తెలిపింది. అలాగే.. రోజువారి పాజిటివిటీ రేటు కూడా 5 శాతం లోపేనని పేర్కొంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,15,812 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవి మొత్తం కేసుల్లో 9.29 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
" మరోమైలు రాయిని అందుకున్నాం. గత మూడు రోజులుగా రోజువారి పాజిటివిటీ రేటు 5 శాతం లోపే ఉంచగలుగుతున్నాం. అది కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేయగలుగుతున్నట్లు సూచిస్తోంది. బుధవారం రోజువారి పాజిటివిటీ రేటు 3.8 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసులూ గణనీయంగా తగ్గుతున్నాయి. కొద్ది రోజులుగా 7.5 లక్షలలోపే ఉంటున్నాయి. "
- కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ.
దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 69 లక్షలకు చేరువైంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల్లో 79,415 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇదే సమయంలో కేవలం 55,839 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో రికవరీ రేటు 89.20 శాతానికి చేరింది. కొత్తగా కోలుకున్న వారిలో 81 శాతం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. అందులో అధికంగా మహారాష్ట్రలో 23 వేల మంది ఉన్నారు. అలాగే.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 78 శాతం 10 రాష్ట్రాల్లోనే ఉండగా.. మహారాష్ట్ర(8వేలు), కేరళ(5వేలు)లో అత్యధిక కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు.. 77,06,946 కేసులు, 1,16,616 మరణాలు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: దేశంలో 77లక్షలు దాటిన కరోనా కేసులు