దేశంలో కరోనా యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,59,819కి చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో ఈ సంఖ్య 3.6 శాతంగానే ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.. శనివారం తెలిపింది. రోజువారీ కొత్త కేసులతో పోలిస్తే.. రికవరీల సంఖ్య ఎక్కువగా, మరణాల సంఖ్య తక్కువగా ఉండడం వల్లే ఈ ఫలితాలు నమోదయ్యాయని పేర్కొంది.
"భారత్లో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3.6 లక్షల కంటే దిగువకు చేరింది. ఇది మొత్తం కరోనా కేసుల్లో కేవలం 3.6శాతంగా ఉంది. గత 15 రోజులుగా కొత్తగా నమోదయ్యే కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్యే అధికంగా నమోదవుతోంది."
-- కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ
ఒక్కరోజులో 33,494 మంది వైరస్ నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 30,006 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారని తెలిపింది.
మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, బంగాల్, ఉత్తర్ప్రదేశ్, దిల్లీలో రోజువారీ కేసుల్లో క్రమంగా తగ్గదల కనిపిస్తోందని చెప్పింది. కొన్నిరోజులుగా మరణాల సంఖ్యలోనూ తగ్గుదల కనిపిస్తోందని పేర్కొంది.
ఇదీ చూడండి:కొవిషీల్డ్.. నెలకు 10కోట్ల డోసులు