ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి అష్టకష్టాలు పడుతున్న భారతీయుల గోస ఇది! కాలుమోపటానికి కూడా జాగా కనిపించని ఆ గదిలో కిక్కిరిసి ఉన్న వారెందరో తెలుసా...250 మందికిపైనే. కరోనా వ్యాప్తికి ముందు సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారనే నెపంతో బందీలుగా చిక్కుకుపోయిన వారే. వీరిలో ఒక బాధితుడు ముస్తాకిమ్ తీసి పంపిన వీడియో దృశ్యాలు శనివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కస్బాకు చెందిన ముస్తాకిమ్ కరోనా లాక్‌డౌన్ విధించటానికి 15 రోజుల ముందు భవన నిర్మాణ స్థలంలో పనిచేసేందుకు సౌదీ అరేబియాకు వెళ్లినట్లు ఆయన భార్య షబానా 'ఈటీవీ భారత్'కు తెలిపారు. అక్కడ విధించిన కరోనా నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల లోపు ఇళ్ల నుంచి బయటకు రావటం నిషేధం. అది తెలియని తన భర్త ఉదయం 8.30 గంటల సమయంలో వెలుపలికి రావటంతో పోలీసులు తీసుకెళ్లి ఒక గదిలో నిర్బంధించారని సబానా వెల్లడించారు. అప్పటికే ఆ గదిలో 250 మందికిపై ఉన్నారని, గత అయిదు నెలలుగా వారంతా అక్కడే బందీలుగా ఉన్నారని ఆమె చెప్పారు. భారత పౌరుల పట్ల సౌదీ అధికారుల ప్రవర్తన సరిగా లేదని ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకొని తన భర్తను భారత్‌కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని షబానా అభ్యర్థించారు.