ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకొంటాం. ఆ రోజు భారత రాజ్యాంగానికి ఆమోదం లభించింది. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన రాజ్యాంగం.. 70 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఈ నేపథ్యంలో రాజ్యాంగ నిపుణుడు సుభాష్ సి.కశ్యప్‌తో ఈటీవీ భారత్ ముచ్చటించింది. 7,8,9వ లోక్‌సభలకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన కశ్యప్.. రాజ్యాంగ విశిష్టతపై మాట్లాడారు.
రాజ్యాంగం రూపొందించుకుని 70 ఏళ్లు పూర్తి కావొస్తుంది. ఈ సమయంలో మీకు ఎన్నో అనుభవాలు ఎదురై ఉంటాయి. ఇన్నేళ్లలో భారత్ ప్రయాణం ఎలా ఉందని మీరు భావిస్తున్నారు?
మన రాజ్యాంగం అద్భుతమైనది. చాలా భిన్నమైనది. దీనంతటికీ కారణం గొప్ప మేధావులు సమష్టిగా భవిష్యత్తు ఆశయాలకు తగ్గట్టుగా రాజ్యాంగాన్ని రచించారు. నాయకులు, దేశభక్తులు, విద్యావేత్తలు మూడేళ్లలో అతిపెద్ద రాజ్యాంగ రచనను పూర్తి చేసి రికార్డు సృష్టించారు. భారత రాజ్యాంగం కాల పరీక్షలో నెగ్గింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రూపొందిన పలు దేశాల రాజ్యాంగాల తరహాలో రద్దుగానీ, పునర్ రచనగానీ జరగలేదు. ఇన్నేళ్లుగా జాతీయ సమగ్రతను కాపాడుతూ వస్తోంది. అయితే రాజ్యాంగంపై సరైన అవగాహన లేక చాలా మందికి అనేక అంశాల గురించి తెలియకపోవటం దురదృష్టకరం. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పొందాం... కానీ సూచించిన విధులను నిర్వర్తించటంలో విఫలమయ్యాం.
ఇప్పటివరకు మన రాజ్యాంగంలో చాలా సవరణలు చేశారు. ఇలా కాలానుగుణంగా సవరణలు చేయటం ఎంతమేరకు అవసరం?
రాజ్యాంగమనేది స్వభావంలో అత్యంత దృఢంగా ఉండకూడదు. కొన్ని నిబంధనల్లో ఆయా సమయాల్లో వచ్చే డిమాండును అనుసరించి పునఃపరిశీలన, సవరణ, మార్పులకు అవకాశం ఉండాలి. రాజ్యాంగంలోని 11వ భాగంలోని అధికరణ 368ను ఉపయోగించి కాలానుగుణంగా ఇప్పటివరకు సవరణలు చేశారు. ఇలా 1950 నుంచి 103 సవరణలు చేశారు. అధికరణ 370 గురించి ఈ మధ్యకాలంలో చాలా చర్చ జరిగింది. ఆ అధికరణను మార్చేందుకు ఎలాంటి రాజ్యాంగ సవరణ అక్కర్లేదు. ఎందుకంటే అది స్వతహాగా మారేందుకు అవకాశం ఉంటుంది. అయినా అధికరణ 370ను రద్దు చేయలేదు. అందులోని కొన్ని నిబంధనలను మార్చారు.
పార్లమెంటులో సరైన చర్చ జరగకుండానే ఆత్రంగా రాజ్యాంగ సవరణలు చేస్తోందని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. రాజ్యాంగం ప్రమాదపు అంచులో ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ తాజా పరిణామాలపై మీరేం చెబుతారు?
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాల్లో రాజ్యాంగం కన్నా రాజకీయాలకు సంబంధించినవే. రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి రాజ్యాంగాన్ని సక్రమంగా అమలుచేస్తే ఎలాంటి సమస్యలు తలెత్తవు. రాజ్యాంగంలో కేంద్రం, రాష్ట్రాలకు సంబంధించి శాసనాధికారాలను పొందుపరిచారు. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలుగా వీటిని విభజించారు. రాజకీయ కారణాలతో కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం విమర్శలు వస్తూనే ఉంటాయి. ఈ సంస్కృతికి కారణమైనందుకు ప్రతి రాజకీయ పార్టీని నిందించాల్సిందే.
సీఏఏకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆందోళనలు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? లేదా ప్రజలకు అవగాహన లేని కారణంగా జరుగుతున్నాయా?
అవగాహన లేకపోవటం, నిర్లక్ష్యం ఈ నిరసనలకు కారణాల్లో కొన్ని. ప్రజలు వారి ఆందోళనలను హింసాత్మక మార్గంలో చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రజలు తమ అసంతృప్తిని తెలిపేందుకు దౌర్జన్యాలకు పాల్పడటం దురదృష్టకరం.
సీఏఏ రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ చట్టం అమలు చేసేందుకు పలు రాష్ట్రాలు నిరాకరిస్తున్నాయి. వారి నిరసన సరైనదేనా?
ఈ చట్టంతో పౌరసత్వం కల్పిస్తామే కానీ తొలగించమని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. పౌరసత్వ నిబంధనలు కేంద్ర జాబితాలోని అంశం. దీనిపై రాష్ట్రాలకు ఎలాంటి శాసనాధికారం ఉండదు. భారత్‌లో ఏక పౌరసత్వం అమల్లో ఉంది. దీన్ని నిర్ధరించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. అయితే చట్టంగా మారిన తర్వాత సీఏఏను రెండు విధాలుగా సవాలు చేయవచ్చు. మొదటిది.. పార్లమెంటులో దీనిపై మరోసారి చర్చకు తీసుకువచ్చి అవసరమైన సవరణలు చేయవచ్చు. రెండోది.. సుప్రీం కోర్టులో చట్టాన్ని సవాలు చేయాలి. నిరసన అనేది వ్యక్తిగత హక్కు.. కానీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఆందోళన చేయటం సరైన పద్ధతి కాదు.
పౌరసత్వ సవరణ చట్టంపై మీ వ్యక్తిగత అభిప్రాయం ఏమిటి?
నేను ముందు చెప్పినట్లుగానే.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లో మత వివక్షకు గురై భారత్‌కు వలస వచ్చినవారికి పౌరసత్వం లభిస్తుంది. కొన్ని ప్రత్యేక వర్గాలను ఇందులో ప్రస్తావించటం వివాదానికి కారణమయింది. ఏదీఏమైనా, పౌరసత్వం ఎవరికి ఇవ్వాలో..? ఎవరికి ఇవ్వద్దో నిర్ణయించుకునే సార్వభౌమాధికారం ప్రతి దేశానికి ఉంటుంది.