అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశించడానికి ముందే భారతీయ విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. కొద్ది నెలల క్రితం సుమారు 100 మంది భారతీయ విద్యార్థులను అమెరికా అధికారులు వీసా నిబంధనలు ఉల్లంఘించారనే కేసులో నిర్బంధించిన నేపథ్యంలో తాజా హెచ్చరికలు జారీ చేసింది.
అమెరికా వర్సిటీల్లో ప్రవేశం పొందడానికి ముందు, ముఖ్యంగా మూడు విషయాలని పరిగణనలోకి తీసుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.
క్యాంపస్ నుంచే యూనివర్సిటీ పని చేస్తోందా? లేక పరిపాలనా ప్రాంగణాన్ని మాత్రమే కలిగి కేవలం వెబ్సైట్ మాత్రమే నిర్వహిస్తోందా అన్నది గమనించాలి.
ఆ విశ్వవిద్యాలయంలో బోధనా సిబ్బంది, సాధారణ శిక్షకులు, విద్యావేత్తలు ఉన్నారా? అని తెలుసుకోవాలి. కొన్ని వర్సిటీల్లో కేవలం పరిపాలనా సిబ్బంది మాత్రమే ఉంటారు. వారి వెబ్సైట్లలో అధ్యాపకుల వివరాలు ఉండవు. ఈ అంశాలను కచ్చితంగా చూసుకోవాలి.
విశ్వవిద్యాలయానికి తగిన పాఠ్యప్రణాళిక ఉందా, క్రమపద్ధతిలో తరగతులు నిర్వహిస్తున్నారా? ప్రణాళికాబద్ధంగా బోధన, ఇతర విద్యా సంబంధ కార్యక్రమాలు సరిగ్గా అమలు అవుతున్నాయా? చూసుకోవాలి. ప్రభుత్వ అనుమతులు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఈ అంశాలు లేకపోతే అటువంటి వర్సిటీలు నకిలీవని గుర్తించాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.
ఇలాంటి నకిలీ వర్సిటీల్లో చేరినవారు, సాధారణ విద్యార్థుల వీసా కలిగి ఉన్నప్పటికీ, వీసా నిబంధనలు ఉల్లంఘించినట్లే పరిగణిస్తారు. వారిని నిర్బంధించడానికి, అమెరికా నుంచి బహిష్కరించడానికి అవకాశం ఉంది.
ఇదీ విషయం...
'పే అండ్ స్టే' వీసా రాకెట్టును వెలికితీయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ అధికారులు... ఫార్మింగ్టన్ వర్సిటీని డెట్రాయిట్లో ఏర్పాటుచేశారు. ఈ నకిలీ వర్సిటీలో చేరిన 129 భారతీయ విద్యార్థులను అమెరికా అధికారులు నిర్బంధించారు.
అంతకు మునుపు 2013లో న్యూజెర్సీ నకిలీ విశ్వవిద్యాలయం వలలో చిక్కుకుని పలువురు భారతీయ విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఎఫ్-1 వీసా, సర్క్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (సీపీటీ) పొంది ఉన్నప్పటికీ వారు నిబంధనలు ఉల్లంఘించిన వారయ్యారు.
భారత్ నుంచి అమెరికా వస్తున్న కొందరు భారతీయ విద్యార్థుల ప్రధాన ఉద్దేశం చదువు కాదని, అమెరికాలో అక్రమంగా నివసించడమేనని, ఇది నిబంధనలకు విరుద్ధమని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
ఓ విద్యార్థి 'స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రాం' (ఎస్ఈవీఐసీ) పొంది అమెరికా వెళ్లినప్పటికీ, అది నకిలీ వర్సిటీ అయితే నిబంధనలు ఉల్లంఘించినట్లే అవుతుందని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులు నకిలీ వర్సిటీల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వీసా నిబంధనలు కచ్చితంగా పాటించాలని భారత రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి శంభు హక్కి సూచించారు.
ఇదీ చూడండి: ప్రశాంతంగా 'సార్వత్రిక' పోలింగ్...