హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్, ఆస్రేలియా సంయుక్తంగా భారీ నావికా విన్యాసాలు నిర్వహించనున్నాయి. బుధవారం ప్రారంభమయ్యే ఈ విన్యాసాలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఇందులో సంక్లిష్ట నౌకాదళ విన్యాసాలతో పాటు విమాన నిరోదక డ్రిల్స్, హెలికాప్టర్ ఆపరేషన్లు ఉంటాయని అధికారులు తెలిపారు.
"సాంకేతిక సమాచార మార్పిడి, పరస్పర అవగాహన మెరుగుపరచటం, ఉత్తమ పద్ధతుల ప్రోత్సాహం ఈ విన్యాసాల లక్ష్యం. ఆయుధాల ఫైరింగ్, నౌకా అభ్యాసాలు, క్రాస్ డెక్ ఫ్లయింగ్ ఆపరేషన్లు, అధునాతన ఉపరితల, వాయు నిరోధక వ్యవస్థల విన్యాసాలు ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటాయి. రెండు దేశాల మధ్య నౌకాదళ సంబంధాలు కొనసాగిస్తూ రక్షణ సంబంధాల బలోపేతానికి ఈ విన్యాసాలు దోహదపడుతాయి."
- నావికా దళ అధికార ప్రతినిధి
వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు, హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా నావికా దళ కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విన్యాసాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి భారత నావికాదళం చేస్తోన్న నాలుగో ప్రధాన నావికా విన్యాసాలు ఇవి కావటం విశేషం. ఇప్పటికే అమెరికా, జపాన్, రష్యాలతో భారీ నౌకాదళ డ్రిల్స్ నిర్వహించింది.
రాయల్ ఆస్ట్రేలియన్ నేవీలోని కీలకమైన హోబర్ట్ శ్రేణి ఎయిర్ వార్ఫేర్ డెస్ట్రాయర్ హెచ్ఎంఏఎస్ హోబర్ట్ ఇందులో పాల్గొననుంది. భారత్ నుంచి సహ్యాద్రి, కార్ముఖ్ భాగం కానున్నాయి.
ఇదీ చూడండి: మారని పాక్ వక్రబుద్ధి- డ్రోన్లతో ఆయుధాలు చేరవేత