వాస్తవాధీన రేఖ వెంబడి, లద్దాఖ్ సెక్టార్లో విధులు నిర్వహిస్తున్న సైనిక బలగాల కోసం... అత్యంత శీతల వాతావారణాన్ని తట్టుకునే గుడారాలను అత్యవసరంగా ఏర్పాటు చేసేందుకు భారత సైన్యం సమాయత్తమవుతున్నట్లు సమాచారం.
చైనా దురాక్రమణను ఎదుర్కొనేందుకు భారత్ సైన్యం లద్దాఖ్ సెక్టార్లో 30 వేల మంది అదనపు సైనిక బలగాలను మోహరించింది. కనీసం సెప్టెంబర్- అక్టోబర్ వరకు ఈ ప్రతిష్టంభన కొనసాగే అవకాశం ఉంది. అందువల్ల వాస్తవాధీన రేఖ వెంబడి విధులు నిర్వహించే సైనికుల కోసం అత్యంత శీతల వాతావరణాన్ని తట్టుకునే గుడారాలు ఏర్పాటు చేయడం తప్పనిసరి.
చైనాను నమ్మడం కష్టం
ప్రస్తుతం చైనా దళాలు వాస్తవాధీన రేఖ నుంచి తన సైనిక బలగాలను వెనక్కి ఉపసంహరిస్తోంది. అయితే చైనాను నమ్మడం కష్టం కనుక మన సైనిక బలగాలను సరిహద్దుల్లో నిలపడం తప్పనిసరి.
"సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి సమకూర్చడం సహా అత్యవసరంగా అత్యంత శీతల వాతావరణాన్ని తట్టుకోగలిగే గుడారాలు ఏర్పాటుచేయడంపైనే దృష్టి కేంద్రీకరించాం."
- భారత సైనిక వర్గాలు
చైనీయులు ఇప్పటికే..
చైనా సైనికులు ఇప్పటికే ప్రత్యేక శీతాకాలపు గుడారాలను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. సియాచిన్‌లో విధులు నిర్వహిస్తున్న భారత సైనికులకు కూడా ఇలాంటి టెంట్లే ఉన్నాయి.
ఇప్పటికే ఇలాంటి కొన్ని టెంటులను తూర్పు లద్దాఖ్‌లో ఏర్పాటు చేసినా.. ఇంకా చాలా ఎక్కువ సంఖ్యలో వీటి అవసరం ఉంది. అందుకే శీతాకాలం వచ్చేలోపే వీటిని సేకరించేందుకు సైన్యం... భారత్ సహా ఐరోపా మార్కెట్లపై దృష్టి సారించింది.
రక్షణ దళాల కోసం రూ.500 కోట్లు
ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఆవాసాల కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.500 కోట్లను రక్షణ దళాలకు మంజూరు చేసింది. దీనితో భారత సైన్యం తన ఎమ్-777 ఆల్ట్రా లైట్ హోవిట్జర్స్ కోసం ఎక్సాలిబర్ మందుగుండు సామగ్రిని సమకూర్చుకోనుంది. అలాగే రష్యా సహా ఇతర ప్రపంచ సరఫరాదారుల నుంచి రకరకాల ఆయుధాలను కొనుగోలు చేయనుంది.
ఇదీ చూడండి: డోభాల్ ఎంట్రీతో చైనా సరిహద్దులో మారిన లెక్కలు