తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో వచ్చే శీతాకాలంలోనూ ప్రస్తుతం మోహరించిన సైనిక, ఆయుధ శక్తిని కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తోంది భారత్. ఫింగర్ ఏరియాల నుంచి బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు చైనా ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు.. సరిహద్దు పరిస్థితులపై శనివారం(ఆగస్టు 1న) చర్చలో పాల్గొన్న అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మోహరించిన సైనిక దళాలు, యుద్ధట్యాంకులు, ఇతర ఆయుధ శక్తిని కొనసాగించనున్నట్లు పేర్కొన్నాయి.
చైనాపై ఒత్తిడి పెంచేందుకు హిందూ మహాసముధ్రంలో యుద్ధ నౌకలను నౌకాదళం మోహరిస్తున్న క్రమంలో.. సరిహద్దు ప్రాంతాల్లో భారత వాయుసేన కూడా అప్రమత్తమైనట్లు తెలిపారు అధికారులు. నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులపై ఉన్నత స్థాయి మిలిటరీ, దౌత్య అధికారులు సమీక్షించారని, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే ఎప్పటికప్పుడు సైనిక సన్నద్ధతపై రక్షణ మంత్రికి తెలియజేస్తున్నారని చెప్పారు.
" శీతాకాలంలోనూ తూర్పు లద్దాఖ్‌లో ప్రస్తుత సైనిక, ఆయుధ శక్తిని కొనసాగించేందుకు సన్నద్ధమవుతున్నాం. ప్రస్తుత పరిస్థితులపై అంచనాల ఆధారంగా అమలు చేయాలనుకుంటున్న ప్రణాళిక అది. ఈ ప్రాంతంలో విధులు నిర్వర్తించే సైనికుల కోసం చలిని తట్టుకునే దుస్తులు, ఇతర అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పాంగోంగ్ సరస్సులోని ఫింగర్ ఏరియాల్లో బలగాల ఉపసంహరణను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరుదేశాల కమాండర్ స్థాయి చర్చలు వచ్చే వారం జరిగే అవకాశం ఉంది. "
- అధికార వర్గాలు
విస్తృతమై సన్నాహాలు అవసరం..
శీతాకాలంలో మైనస్ 20 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడుపోతాయి కాబట్టి ఎత్తైన ప్రాంతంలో ప్రస్తుత స్థాయి బలగాలు, ఆయుధాలను కొనసాగించేందుకు విస్తృతమైన సన్నాహాలు అవసరమని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
భారత్ డిమాండ్..
చైనా సైనికులతో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో ఘర్షణ తలెత్తిన క్రమంలో వందల సంఖ్యలో అదనపు బలగాలు, యుద్ధ ట్యాంకులు, తుపాకులు వంటి ఆయుధాలను సరిహద్దుకు తరలించింది భారత్. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. లద్దాఖ్‌లోని సరిహద్దు ప్రాంతాల నుంచి చైనా బలగాలను వెనక్కి మళ్లించినప్పటికీ, ఫింగర్ ఏరియాల నుంచి ఉపసంహరణ చేపట్టటం లేదు. ఫింగర్ 4, 8 ప్రాంతాలనుంచి బలగాలను వెనక్కి పంపాలని భారత్ డిమాండ్ చేస్తోంది.
ఇదీ చూడండి: తూర్పు లద్దాఖ్ పరిస్థితులపై సీఎస్జీ సమీక్ష