ఏపీజీ యూనివర్సిటీ విద్యార్థుల వీరంగం! విశ్వ విద్యాలయం అంటే ఓ మినీ ప్రపంచం. దేశ విదేశీ విద్యార్థుల సమాహారం. భిన్న సంస్కృతులు ఒకేచోట ప్రతిబింబిస్తాయిక్కడ. కానీ, ఈ విషయాన్ని విస్మరించిన కొందరు విద్యార్థులు దేశీయ, విదేశీ బృందాలుగా విడిపోయి పరస్పరం దాడికి దిగారు.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని అలక్ ప్రకాశ్ గోయల్(ఏపీజీ) యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థుల కొట్లాట వివాదాస్పదమైంది.
క్యాంపస్ హాస్టల్లో జరిగిన చిన్న తగాదా పెను తుపానుగా మారింది. ముందు రోజు ఆహారం విషయంలో విద్యార్థులకు ఏదో గొడవొచ్చింది. శుక్రవారం కాలేజీకి వచ్చాక, స్నేహితులతో ఈ విషయాన్ని చర్చించారు. జరిగిపోయిన గొడవను తవ్వుకొని క్యాంపస్‌లోనే, ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఒకరినొకరు కాళ్లతో తన్నుకుంటూ, కుర్చీలు విసురుకుంటూ, బెల్టులతో కొట్టుకుంటూ బీభత్సం సృష్టించారు.
విద్యార్థులపై దాడి చేసింది పూర్వ విద్యార్థులని, వారిప్పుడు కళాశాలలో చదవట్లేదని యాజమాన్యం తెలిపింది. కొందరిని కళాశాల నుంచి బహిష్కరించామని అధికారులు తెలిపారు. విద్యార్థుల భద్రతా దృష్ట్యా విశ్వవిద్యాలయంలో పోలీసు బలగాలను మోహరించారు.
ఇదీ చూడండి:రేడియో గురూ: పాఠాలు చెప్పే ఆకాశవాణికి శ్రోతలెందరో!