జూన్3వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ సియాంగ్ జిల్లా పయూమ్ పరిధిలో ఏఎన్-32 విమానం గల్లంతయింది. ఈ విమానంలో ప్రయాణించిన వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు భారత వాయుసేన అధికారికంగా ట్విట్టర్ ద్వారా తెలిపింది.
విమాన శకలాలను గుర్తించిన ప్రాంతాన్ని బుధవారం తనిఖీ బృందాలు జల్లెడ పట్టాయి. ఈ గాలింపులో ఎవరూ సజీవంగా లేరని వెల్లడైంది. అమర వీరులకు నివాళులు అర్పించిన భారత వాయుసేన.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది.
ఏం జరిగింది..?
జూన్ 3 మధ్యాహ్నం 12.25 గంటలకు అసోంలోని జోర్హాట్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరింది ఏఎన్-32 విమానం. కొద్ది సేపటికే విమానం గల్లంతైంది. అది అరుణాచల్ ప్రదేశ్ మెన్చుకా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్‌కు చేరుకోవాల్సి ఉంది. ఇందులో 8 మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు కలిపి 13 మంది ఉన్నారు.
- ఇదీ చూడండి: 'ఈ తరహా దాడులు జరక్కుండా చూడాలి'