పునరుత్పాదక ఇంధనానికి సంబంధించి విద్యుత్ రంగ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలకు భారత్ కట్టుబడి ఉంటుందని స్పష్టంచేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్. ఈ విషయంలో పెట్టుబడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.
దిల్లీలో జరిగిన 'సీఈఆర్ఏ వీక్-ఇండియన్ ఎనర్జీ ఫోరమ్' సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి. పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు నిర్మల. నిబంధనలు సరళించి, ఆంధ్రప్రదేశ్ పీపీఏ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల చట్టానికి సవరణలు చేస్తున్నామని, సంస్కరణలు కొనసాగుతాయని తెలిపారు నిర్మల.
ఆంధ్రప్రదేశ్ వైఖరితో..
2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేయాలని ధ్యేయంగా పెట్టుకుంది భారత్. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరం.
అయితే... విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)ను రద్దు చేస్తామని తొలుత ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తర్వాత వైఖరిని కాస్త మార్చుకుంది. విద్యుత్ సుంకాలు తగ్గించేలా సంబంధిత సంస్థలతో మరోమారు చర్చలు జరపాలని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ), ఎన్టీపీసీని కోరింది ఏపీ సర్కార్. ఏపీ చేసిన ఈ ప్రతిపాదనలతో పెట్టుబడిదారుల విశ్వాసంపై తీవ్ర ప్రభావం పడింది.
ఇదీ చూడండి: 6 పైసల కోసం టెలికాం దిగ్గజాల మధ్య మీమ్స్ వార్