వివిధ అంతర్జాతీయ అంశాలపై భారత్- అమెరికా మంగళవారం వర్చువల్ విధానంలో సమావేశాన్ని నిర్వహించాయి. ఈ నేపథ్యంలో దైపాక్షిక సహకారంపై ఇరు దేశాలకు చెందిన అధికారులు చర్చించారు. స్వేచ్ఛ, శాంతి, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని స్థాపించేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నట్టు పునరుద్ఘాటించారు.
"అమెరికా రాజకీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డేవిడ్ హేల్, భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా మంగళవారం సమావేశమయ్యారు. నియమాల ఆధారంగా నడిచే అంతర్జాతీయ వ్యవస్థ, ద్వైపాక్షిక, బహుళ విధానాల దౌత్య సహకారం, సముద్ర భద్రతకు వాటిల్లుతున్న ముప్పుపై చర్చించారు. కరోనా వైరస్‌పై ప్రపంచ దేశాల తీరుపైనా సమాలోచనలు జరిపారు. ఇదే సమావేశంలో అంతర్జాతీయ సమస్యలపై పూర్తి స్థాయి ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన విషయాలను చర్చించారు. ఇరు దేశాలకు చెందిన నేతలు నిర్దేశించిన ప్రపంచస్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత దృఢపరచాలని నిర్ణయించారు."
--- అమెరికా రాజకీయ వ్యవహారాల శాఖ ప్రకటన
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా తన సైనిక, ఆర్థిక శక్తిని పెంపొందించుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు విసిరే సవాళ్లను కలిసిగట్టుగా ఎదుర్కోవాలని, ఒకరి లక్ష్యాలకు మరొకరు మద్దతు పలకాలని ఇరు దేశాల ప్రతినిధులు తీర్మానించారు.