భారత్‌లో పర్వత ప్రాంత పర్యటక ప్రదేశాలు పరిమిత వనరులతో ఇబ్బందులు పడుతున్నాయి. కొంతమందికే ఆతిథ్యం కల్పించగలిగే సామర్థ్యం ఉండటంతో సమస్యలు ఎదురవుతున్నాయి. 2000 సంవత్సరం నుంచి 2018 వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యాటకుల సంఖ్య 8.5 రెట్లు పెరిగింది. ఏ పర్యాటక ప్రాంతం చూసినా కిటకిటలాడుతోంది. డార్జిలింగ్ నుంచి మనాలి వరకు దేశంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలన్నీ యాత్రికుల సంఖ్య పెరిగితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ట్రాఫిక్ రద్దీ, పొంగిపొర్లే మురుగు, అడ్డగోలు నిర్మాణాలు, నీటికి కటకట తదితర సమస్యలతో సతమతమవుతున్నాయి. భారతీయ పర్యాటక ప్రాంతాల స్థితిగతులు ఇలా ఉండగా మన పొరుగునే ఉన్న చిన్ని దేశం భూటాన్ తీసుకున్న నిర్ణయాలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి.
ఉన్నత శ్రేణికి పెద్దపీట...
భారత్, బంగ్లాదేశ్, మాల్దీవుల నుంచి ప్రాంతీయ పర్యాటకుల స్వేచ్ఛా ప్రవేశానికి ఫిబ్రవరి 4న భూటాన్ ముగింపు పలికింది. ఆ దేశంలో పర్యటించే మొత్తం పర్యాటకుల్లో భారతీయుల సంఖ్యే 70 శాతందాకా ఉంటుంది. ఇకపై ఇలాంటి పర్యాటకులు రోజుకు రూ.1,200 చొప్పున సుస్థిరాభివృద్ధి రుసుము(ఎస్‌డీఎఫ్) చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము కేవలం కొన్ని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలకే వర్తిస్తుంది. తక్కువ బడ్జెట్‌తో విహార యాత్రలు చేపట్టేవారికిది పెద్ద దెబ్బే. ఎస్‌డీఎఫ్ కారణంగా వ్యయాలు 50 నుంచి 60 శాతం దాకా పెరిగే అవకాశం ఉంది. 2018లో భూటాన్‌లో 2.74 లక్షల మంది పర్యటించారు. ఇందులో రెండు లక్షల మంది ప్రాంతీయ పర్యాటకులే.
తక్కువ బడ్జెట్ పర్యటకులే అధికం...
మూడింట రెండోవంతు ప్రాంతీయ యాత్రికులు భూటాన్‌లోకి ప్రవేశించేందుకు చవకగా ప్రయాణించే రహదారి మార్గాలనే ఉపయోగించుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది తక్కువ ఖర్చుతో పర్యటించే బడ్జెట్ పర్యాటకులే. ఇలాంటి పరిస్థితుల్లో భూటాన్ కొత్తగా యాత్రికులపై రుసుములు ఎందుకు విధించిందనే ప్రశ్న తలెత్తకమానదు. ఉన్నత శ్రేణికి చెందిన ఖరీదైన పర్యాటకుల్ని కాదని; వనరులు, సౌకర్యాలన్నింటినీ ఆక్రమించే ‘బడ్జెట్’ పర్యాటకుల్ని ఆ దేశం కోరుకోవడం లేదు. ఉన్నత శ్రేణి పర్యాటకులైతే దీర్ఘకాలంపాటు బస చేస్తారు. కార్లు, ఆహారం, ఇతర సౌకర్యాలపై పెద్దమొత్తంలో ఖర్చు పెడతారనేది వారి ఉద్దేశం.
భూటాన్ భేష్...
ఇదంతా ఎందుకంటే, భూటాన్ తన పర్యావరణం పట్ల ఎల్లప్పుడూ ఒకింత జాగ్రత్తగా ఉంటుంది. సాంస్కృతిక పర్యావరణంపై శ్రద్ధవహిస్తుంది. గత దశాబ్ది కాలంలో ఆ దేశంలో పర్యాటకుల సంఖ్య సుమారు మూడురెట్లు పెరిగింది. పర్యాటకుల తాకిడి పెరగడంతో ఆ దేశం నియంత్రణ చర్యలకు నడుంకట్టింది. దీనివల్ల పలు ప్రయోజనాలు సమకూరతాయి. దేశంలోకి పెద్దయెత్తున తరలి వచ్చే పర్యాటకుల్ని రుసుముల పేరిట నిలువరించడం ద్వారా అడ్డగోలుగా చేపట్టే నిర్మాణాలను పరిహరించవచ్చు. అత్యంత ఆకర్షణీయ పర్యాటక కేంద్రాల్లో భారీస్థాయిలో పోగుపడే వ్యర్థాల ముప్పు, పర్యావరణ క్షీణతను అడ్డుకోవచ్చు. ఉన్నత శ్రేణి పర్యాటకుల ద్వారా గరిష్ఠస్థాయిలో ఆదాయాల్ని పొందవచ్చు. ఎవరూ పెద్దగా సందర్శించని పర్యాటక ప్రదేశాల్లో ఎస్‌డీఎఫ్‌ను విధించడం లేదు. దీనివల్ల ‘బడ్జెట్’ ప్రయాణికుల్ని ఆయా ప్రాంతాల్లో పర్యటించేలా ప్రోత్సహించవచ్చు.
భూటాన్ రహస్యమదే...
నియంత్రణలు ఉన్నప్పుడే మార్కెట్ ఆర్థిక వ్యవస్థ అత్యుత్తమంగా పనిచేస్తుందని ప్రఖ్యాత అమెరికా ఆర్థికవేత్త పాల్ క్రుగ్‌మ్యాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం భూటాన్ చేస్తున్నదిదే. పర్యాటక ప్రదేశాలు విలువైన సంపద. మిగతా అన్ని ఉత్పత్తులు, బ్రాండ్లలాగే ఎప్పటికప్పుడు వాటి విలువనూ కాపాడుకోవాల్సి ఉంటుంది. సిమ్లా, డార్జిలింగ్ వంటివి ఉన్నత స్థాయి పర్యాటక బ్రాండ్లు. ఇలాంటి చోట్ల మార్కెట్‌ను నియంత్రించడంలో విఫలమైతే, వాటి విలువ, నాణ్యతలకు పెద్ద ముప్పే. ఇప్పటికే డార్జిలింగ్ పట్టణం మురికివాడలా మారిపోవడంతో, అక్కడ భవిష్యత్తులో ఆదాయ వనరులకు గండిపడే ప్రమాదం పొంచి ఉంది. సమస్యను గుర్తించిన అధికారులు ప్రత్యామ్నాయ పర్యాటక ప్రదేశాలను ప్రోత్సహిస్తున్నారు. డార్జిలింగ్ కొండల్లో ఈ తరహా ప్రదేశాలను పెద్ద సంఖ్యలో గుర్తించారు.
భారత్ అలా లేదు...
అత్యుత్తమ స్థాయిగల రిసార్టులు ఉండే దక్షిణ గోవాలోని పర్యాటక ప్రదేశాలపైనే ప్రస్తుతం విదేశీ పర్యాటకులు మక్కువ చూపుతున్నారు. ప్రస్తుతానికి, భూటాన్ తరహాలో భారత్ ఎలాంటి ప్రత్యక్ష నియంత్రణ చర్యలూ తీసుకోవడం లేదు. 2010లో మేఘాలయలో 6.6 లక్షల పర్యాటకులు పర్యటించారు. 2017నాటికి ఆ సంఖ్య 10 లక్షలకు చేరింది. ఏటికేడాది 19 శాతం వృద్ధి నమోదైంది. అయితే, తీవ్రమైన రద్దీ, ఇరుకు మార్గాలు, చెత్త, వ్యర్థాలు పోగుపడటం, అడ్డగోలు నిర్మాణాలు పెరిగిపోవడం వంటి సమస్యలు మేఘాలయను ఉక్కిరిబిక్కిరి చేశాయి.
నిర్మాణాత్మక నియంత్రణ అవసరం...
ప్రస్తుతం భూటాన్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు పొరుగునే ఉన్న భారత్‌కు చెందిన అరుణాచల్‌ప్రదేశ్‌కు వరంలా మారుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఇటీవలే ప్రయాణాలపై ఆంక్షల్ని ఎత్తివేయడం మరిన్ని అవకాశాల్ని కల్పిస్తోంది. అయితే, కనీస మౌలిక సదుపాయాలు కరవైతే పెద్దగా ప్రయోజనం ఉండదు. అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో పట్టణ ప్రణాళిక ఏమాత్రం ఉన్నట్లు కనిపించదు. భూటాన్‌తో పోలిస్తే, కారు అద్దెలు చాలా అధికం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మన దేశంలో కొత్త పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి దీర్ఘకాలిక, బహుళ రంగాలకు సంబంధించిన ప్రణాళికలు అవసరం. దీన్ని మార్కెట్ నియంత్రణకు విడిచిపెట్టడం సరికాదు. అసంఘటిత రీతిలో పోగయ్యే మార్కెట్ శక్తులు అడ్డగోలు రద్దీని పెంచి, సంఘటిత అభివృద్ధికి అడ్డంకిగా మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రజాదరణ పొందుతున్న ప్రముఖ పర్యాటక ప్రదేశాల్ని వాటి బ్రాండ్, మౌలిక సదుపాయాలు, ఎంతమంది పర్యాటకుల రద్దీని భరించగలవనే పరామితుల ఆధారంగా ‘గ్రేడింగ్’ చేయడం మంచిది. అదేవిధంగా, పర్యాటక ప్రదేశాల్లో ప్రమాణాలు మరింత దిగజారిపోకుండా తగిన చర్యలు తీసుకునే దిశగా రాష్ట్రాల్ని ప్రోత్సహించడమూ అవసరమే.
- ప్రతిమ్ రంజన్ బోస్, రచయిత - సీనియర్ పాత్రికేయులు
ఇదీ చదవండి: దిల్లీ ప్రభుత్వ పాఠశాలకు ట్రంప్ సతీమణి..!