చైనాలో కరోనా వైరస్ బారిన పడి మృతి చెందేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భారత్‌లోనూ రెండో కేసు నమోదు అయిన నేపథ్యంలో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. చైనా నుంచి భారత్‌కు వెళ్లాలనుకునే పర్యటకులకు ఈ-వీసాలను నిలిపివేసినట్లు చైనాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.
చైనావాసులు, డ్రాగన్ దేశంలోని విదేశీయులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని రాయబార కార్యాలయం తెలిపింది. ఇప్పటికే జారీ చేసిన ఈ-వీసాలు ఇకపై చెల్లవని పేర్కొంది. ఎవరైనా బలమైన కారణంతో భారత్ వెళ్లాలనుకుంటే తమను సంప్రదించాలని సూచించింది.
వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వుహాన్ నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో 654మందిని భారత్‌కు తీసుకొచ్చారు. ఇప్పటివరకు చైనాలో కరోనా వైరస్ 14,562మందికి సోకగా.. 300పైగా మంది మరణించారు. దాదాపు 25 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించింది.