విదేశీ వలసలపై అమెరికా తాత్కాలిక నిషేధం ఆదేశాలను భారత్ అధ్యయనం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీని ప్రభావం భారతీయులపై ఉంటుందన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
"రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలే కీలకం. ఇది కొనసాగుతుందని మేం విశ్వసిస్తున్నాం. అయితే ఎంతమందిపై ప్రభావం ఉంటుందనే విషయం వెంటనే తెలియదు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్యపైనా ఇది ఆధారపడి ఉంటుంది."
- ప్రభుత్వ వర్గాలు
విదేశీ వలసలకు అడ్డుకట్ట..
అమెరికాలో విదేశీ వలసలకు అడ్డుకట్ట వేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సంతకం చేశారు. ఫలితంగా అమెరికాలోకి ప్రవేశించే విదేశీ వలసలకు అడ్డుకట్ట పడింది.
ఈ ఆర్డర్ ప్రకారం 60 రోజుల పాటు విదేశీ వలసలపై నిషేధం ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని శ్వేతసౌధం వర్గాలు ప్రకటించాయి.
అమెరికా తాజా నిర్ణయంతో ఆ దేశానికి ఉద్యోగార్థం వెళ్లేవారిపైనే ప్రభావం ఉంటుంది. ఇప్పటికే అమెరికాలో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆదేశాలలో స్పష్టం ఉంది.
ఇదీ చూడండి: అమెరికాకు వలసలు బంద్.. ఉత్తర్వులపై ట్రంప్ సంతకం