రానున్న దశాబ్ద కాలంలో ఏడాదికి ఒక్కటి చొప్పున షికాగో వంటి నగరాలను భారత్‌లో నిర్మించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం అధ్యక్షుడు ముఖేశ్ ఆఘీ. అమెరికా రాజధాని వాషింగ్టన్ వేదికగా హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 'భారత్‌లో ఆకర్షణీయ నగరాలు-సవాళ్లు, అవకాశాలు' అనే పేరుతో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు ఆఘీ. సింగపూర్ తరహాలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) విధానం ద్వారా భారత్‌లో నగరాల నిర్మాణం చేపట్టాలని సూచించారు.
"ప్రస్తుతం భారత్‌కు కొత్త నగరాల అవసరం ఎంతో ఉంది. ఒక ఏడాదిలో షికాగో అంత నగరాన్ని నిర్మించాలి. ఇలా పదేళ్ల పాటు నగరాల నిర్మాణం కొనసాగాలి. పౌరుల దృక్పథం మారుతోంది. ఈ నేపథ్యంలో నగర నిర్వాహకులు ఆర్థికంగాను బలంగా ఉండాలి."
-ముఖేశ్ ఆఘీ, అమెరికా-భారత్ వ్యూహాత్మక ఫోరం అధ్యక్షుడు
అమెరికా-భారత్ వ్యూహాత్మక సదస్సు వేదికగా నగరాల నిర్మాణంపై వక్తలు వారి అభిప్రాయాన్ని పంచుకున్నారిలా..
"అభివృద్ధి చెందుతున్న దేశాలు నగరాల నిర్మాణంలో విభిన్న పద్ధతులను అనుసరించడంపై దృష్టిసారించాలి."
-జాన్ మాకోంబర్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్
"ఆకర్షణీయ నగరాల నిర్మాణంలో 24 అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. భారత్‌లో మాత్రమే కాక అంతర్జాతీయంగానూ ఇవే అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. వీధి దీపాల ద్వారా భౌతిక, డిజిటల్ వనరులను ఏకంచేసి భోపాల్‌లో అద్భుత ఫలితాలను సాధించాం."
-ఎన్ఎస్ఎన్ మూర్తి, నగరాల నిర్మాణ భాగస్వామి
"అమెరికాలో నిర్మాణ రంగంలోని పెట్టుబడులు ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు ఉపకరించే విధంగా ఉన్నాయి."
-అలోక్ సింగ్, డెల్ టెక్నాలజీస్ డైరెక్టర్
"2050 నాటికి 70 శాతం ప్రజలు కేవలం 4 శాతం భూమిపై జీవనం సాగిస్తారని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో నగరాల నిర్మాణం అత్యంత ఆవశ్యకం. నగరాల నిర్మాణంలో పురోభివృద్ధి మందకొడిగా ఉండవచ్చు. అయితే సానూకూలంగానే ఉన్నాయి."
-అమిత్ మిథా, గ్లోబల్ డిజిటల్ సిటీస్ సంస్థ అధ్యక్షుడు
ఇదీ చూడండి: ఏ సిమెంట్‌తో కట్టారో.. బాంబులతో పేల్చినా నిలిచింది